ఇంటికీ ట్రాఫిక్‌ ‘సిగ్నల్‌’ పడాల్సిందే!    

Traffic Impact Assessment For Traffic Problems In Hyderabad - Sakshi

కొత్తగా భారీ భవనాలు, సముదాయాల నిర్మాణానికి ట్రాఫిక్‌ ‘టీఐఏ’తప్పనిసరి

ఆ ప్రాంతంలో ప్రస్తుత ట్రాఫిక్‌ రద్దీ, కొత్త నిర్మాణాలతో వచ్చే ఇబ్బందులతో నివేదిక

మార్గదర్శకాలు సిద్ధం

తొలుత 100– 250 అడుగుల రోడ్లపై నిర్మాణాలకు అమలు

తర్వాత మిగతా  ప్రాంతాలకూ వర్తింపు

ఏదో  చిన్న రోడ్డులో భారీ అపార్ట్‌మెంట్ల సముదాయమో, షాపింగ్‌ మాల్‌నో నిర్మించారు.. వచ్చీ పోయే వాహనాలు, రోడ్డు పక్కనే పార్క్‌ చేసే వాహనాలు, జనంతో ట్రాఫిక్‌ సమస్య మొదలవుతుంది. ఆ రోడ్డులో వెళ్లే వాహనాలూ నిలిచిపోతాయి. మెయిన్‌ రోడ్డుపైనా ప్రభావం చూపిస్తుంది.. కానీ ఇకపై ఈ సమస్యకు చెక్‌ పడనుంది. కొత్తగా భారీ భవనాలు, సముదాయాలు నిర్మించాలంటే.. ఆ ప్రాంతంలో అవసరమైన స్థాయిలో రోడ్డు, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ సదుపాయాలు ఉండాల్సిందే. లేకుంటే రోడ్డు విస్తరణ, పార్కింగ్‌ కోసం అవసరమైన ఏర్పాట్లకు సదరు నిర్మాణదారు బాధ్యత వహించాల్సిందే. 

ఇప్పటివరకు రోడ్ల వెడల్పును పరిగణనలోకి తీసుకొని పర‍్మిషన్లు మంజూరు చేసే స్థానిక సంస్థలు.. త్వరలోనే ట్రాఫిక్‌ రద్దీని కూడా అంచనా వేసి, దానికి అనుగుణంగా అనుమతులు మంజూరు చేయనున్నాయి. చాలా చోట్ల రోడ్ల వెడల్పుతో సంబంధం లేకుండా, పార్కింగ్‌ స్థలం లేకున్నా.. ఎత్తయిన భవనాలను, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌లను నివారించడం, కూడళ్లపై ఒత్తిడిని తగ్గించడంపై ట్రాఫిక్‌ పోలీసు విభాగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.

భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే సదరు ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ నివారణ, క్రమబద‍్ధీకరణకు వీలుగా ‘ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (టీఐఏ)’ను కూడా సమర్పించేలా నిబంధన తేవాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ విభాగం కలిసి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిసింది. దీని ప్రకారం ఇకపై నిర్మాణ  అనుమతులు జారీ చేసే ముందే.. భవన నిర్మాణ ప్లానింగ్‌లో సెట్‌బ్యాక్, పార్కింగ్‌ స్థలం, గ్రీనరీ, వర్షపు నీటి గుంతల ఏర్పాటుతో పాటు ‘టీఐఏ’నివేదికనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది అమల్లోకి వస్తే.. దేశంలో టీఐఏ ఆధారంగా నిర్మాణ అనుమతులు జారీచేసే తొలి కార్పొరేషన్‌గా హైదరాబాద్‌ నిలవనుంది. 

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో రోడ్డు వెడల్పు.. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదిత రోడ్డు వెడల్పులను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం అగ్నిమాపకశాఖ, జలమండలి, పర్యావరణం, వాల్టా, నీటి పారుదల శాఖ,  విమానాశ్రయం, డిఫెన్స్, రైల్వే విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల (ఎన్‌ఓసీ)ను జత చేయాల్సి ఉంటుంది. 

కొత్త విధానంలో ఇలా.. 
ఇక ముందు ప్రస్తుత పత్రాలకు అదనంగా నిర్మాణదారులు టీఐఏను సమర‍్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక కోసం ‘ఎంప్యానల్డ్‌ ట్రాఫిక్‌ కన్సల్టెంట్‌’ద్వారా అవసరమైన పత్రాలు జత చేస్తూ దరఖాస్తు సమరి్పంచాలి. ఒకవేళ రోడ్డు చిన్నగా ఉంటే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో సదరు ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం భవన యజమాని అదనపు స్థలాన్ని కేటాయించాలి. లేదా లింక్‌ రోడ్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంత వాటా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు. 

తొలి దశలో 100 అడుగుల నుంచి 250 అడుగుల వెడల్పు ఉండే రహదారులను ఆనుకొని నిర్మించే భవనాలు/ సముదాయాలకు ‘టీఐఏ’నిబంధనలను వర్తింపజేయనున్నారు. కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్, మల‍్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల భవనాల స్వరూపం, వ్యాపార కార్యకలాపాలను బట్టి టీఐఏను సమరి్పంచాల్సి ఉంటుంది. తర్వాత భారీ నివాస భవనాలకూ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

ట్రాఫిక్‌ సమస్యను నివారించేందుకు.. 

ప్రస్తుతం పార్కింగ్‌ స్థలం లేకున్నా వాణిజ్య భవనాలకు ఎన్‌ఓసీలను మంజూరు చేస్తున్నారు. ఫలితంగా ఆ భవనాల నుంచి వచ్చే వాహనా లు, బయట పార్క్‌ చేసేవాటితో ట్రాఫిక్‌ సమస్య వస్తోంది.అందువల్ల ట్రాఫిక్‌ పోలీసుల అనుమతి ఉంటేనే ఎన్‌ఓసీలు జారీ చేయాలి. 45, 60 అడుగులకుపైన వెడల్పుండే రోడ్ల మీద కట్టేవాటికి, 25 అంతస్తులపైన ఉండే అన్ని భవనాలకు ఈ విధానాన్ని అమ లు చేయడం ఉత్తమం.    – కె.నారాయణ్‌     నాయక్, జాయింట్‌ సీపీ, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ 

మరో ఎన్‌వోసీతో మరింత జాప్యం 
ఇప్పటికే హైరైజ్‌ భవనాలకు నిర్మాణ ఫీజులతోపాటు ఎక్స్‌టర్నల్‌ బెటర్‌మెంట్‌ చార్జీలు, ఇంపాక్ట్‌ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ సొమ్మును సదరు ప్రాంతంలో డ్రైనేజీ, వాటర్, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే వినియోగించాలి. కానీ ప్రభుత్వం సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా ట్రాíఫిక్‌ ఎన్‌ఓసీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదు. ఇప్పుడు పదుల సంఖ్యలో ప్రభుత్వ విభాగాల ఎన్‌ఓసీల కోసమే నెలల కొద్దీ సమయం పడుతోంది. కొత్తగా మరోటి అంటే జాప్యం ఇంకా పెరుగుతుంది.  – సి.శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top