
ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొన్న కారు
మృతులు ముగ్గురూ 23 ఏళ్లలోపు యువకులే
అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులూ మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
నగరంలోని తాడ్‌బండ్ బహదూర్‌పురా ప్రాంతం హెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే రితేష్ కుమార్ కుమారుడు దీపేష్‌కుమార్ (23) శుక్రవారం రాత్రి 11 గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో తన స్నేహితులైన నగరంలోని వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్‌కు చెందిన ప్రియాష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు.
పెద్దఅంబర్‌పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులు తేరుకునేలోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనమయ్యారు. కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్ మిఠల్‌ను అతికష్టమ్మీద బయటికి తీసిన స్థానికులు ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.