
అవకతవకలకుఆస్కారం లేకుండా పరీక్ష
హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు
తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టులో వాదనలు వినిపించింది. మూల్యాంకనం, హాల్ టికెట్ల జారీపై పిటిషనర్ల వాదనను తప్పుబట్టింది. వందల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసినప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసింది.
2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు బుధవారం విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదిస్తూ.. ఈ గ్రూప్–1లో ఎంపికవుతున్న వారు సమాజానికి కీలకమైన సేవలందిస్తారని, వీరంతా భవిష్యత్ తెలంగాణకు వెన్నెముక లాంటి వారని అన్నారు.
వీరి ఎంపిక పారదర్శకంగా జరగకపోతే ప్రమాదకమని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజ్యాంగ సంస్థల అంశాల్లో సెక్షన్ 226 ప్రకారం రెండు సందర్భాల్లో మాత్రమే హైకోర్టు జోక్యం చేసుకోగలదని చెప్పారు. మోసపూరితంగా నిర్వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించారు.
బండిల్ ఆధారంగా అభ్యర్థిని తెలుసుకోలేరు.
‘ఒక్కో పేపర్ ముగ్గురితో దిద్దించాం. ఇద్దరు ఇచ్చి న అత్యధిక మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడించాం. అందరు అభ్యర్థులకు ఇదే విధానాన్ని అనుసరించాం. పదే పదే మూల్యాంకనం అన డం కాదు.. అంతా కలిపి ఒక ప్రక్రియ. బండిల్ ఆధారంగా సెంటర్, అభ్యర్థిని తెలుసుకునే అవకాశమే లేదు. బార్ కోడ్ అధారంగానే జవాబు పత్రాలు దిద్దడానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ బార్ కోడ్, అభ్యర్థి ఎవరో మూల్యాంకనం చేసే వారికి తెలిసే అవకాశమే లేదు.
ఒకట్రెండుసార్లు చిన్న చిన్న తప్పులు జరగడం సాధారణం. అయినంత మాత్రాన రాజ్యాంగబద్ధమైన సంస్థను పదే పదే తప్పుబట్టడం సరికాదు. ప్రక్రియనంతా ప్రధాన మూల్యాంకన దారు పర్యవేస్తుంటారు. నంబర్లు ఒక ఆర్డర్‌లో ఉండటం కోసమే మెయిన్స్‌కు విడిగా హాల్‌టికెట్లు ఇచ్చాం. గతంలో పోలీస్ బోర్డు, జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు కూడా ఇలాగే పరీక్షలు నిర్వహించారు.
హాల్‌టికెట్లను అక్టోబర్‌లో జారీ చేశాం. దీనిని చాలెంజ్ చేస్తూ ఎవరూ కోర్టుకు రాలేదు. హాల్ టికెట్ అందలేదన్న అభ్యర్థులూ లేరు. అక్టోబర్‌లో జారీ చేసిన హాల్‌టికెట్లను మార్చి వరకు ఆగి, ఫలితాలు వెల్లడించాక ఎంపిక కాలేదని తెలుసుకుని చాలెంజ్ చేయడం సమంజసం కాదు’అని టీజీపీఎస్సీ న్యాయవాది వాదించారు. అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.