
ఊహలు, ‘విపరీత ధోరణి’తోఆదేశాలు వెలువరించారు
గ్రూప్–1పై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్
మా వివరణను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలం.. తీర్పు కొట్టివేయాలన్న కమిషన్
ఒకట్రెండు రోజుల్లో విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ).. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి (లీగల్) ఆర్.సుమతి బుధవారం అప్పీల్ దాఖలు చేశారు.
మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్‌ఎల్)ను రద్దు చేస్తూ ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిట్ పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్–1 అభ్యర్థులు 222 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒకట్రెండు రోజుల్లో విచారణ చేపట్టనుంది.
కేసు పూర్వాపరాలు
2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. మెయిన్స్ తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు.
అన్ని సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ వేసింది.
ఊహలతో తీర్పు సమ్మతం కాదు..: ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టబద్ధంగా లేవు. టీజీపీఎస్సీ సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిగణనలోకి తీసు కోలేదు. మున్సిపల్ కమిటీ, హోషి యార్‌పూర్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఊహలు, నమ్మదగిన సాక్ష్యాలు లేనప్పుడు తీర్పు ఇవ్వడం సముచితం కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం సూచన పరంగా చూస్తే ఈ తీర్పు ‘విపరీత ధోరణి’తో ఉంది.
మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని చెబుతూనే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని చెప్పడం పరస్పర విరుద్ధం. కమిషన్ ఉద్యోగ నియమావళి ప్రకారం.. ఫలితాలిచ్చిన 15 రోజుల్లోగా మాత్రమే పునః మూల్యాంకనానికి వీలుంటుంది. మళ్లీ దిద్దాలనడం కూడా చెల్లదు. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం ఉందని సింగిల్ జడ్జి పేర్కొనడం సబబు కాదు.
గత ఏడాది అక్టోబర్ 27న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 18 మందితో కలిపి 21,093 మంది ఉన్నారని ప్రాథమిక సమాచారం ఇచ్చాం. తర్వాత తుది సమాచారం ఆధారంగా ఆ సంఖ్య 21,110 మందికి పెరిగింది. కోర్టు ఆదేశాల కారణంగా వీరిలో 25 మందిని పక్కకు పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ సంఖ్య 21,085కు తగ్గినట్లు మార్చి 30న వెల్లడించాం. ఆంగ్లంలో 924 మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో ఆ సంఖ్య 20,161కి తగ్గింది. ఈ వ్యత్యాసాన్ని శాస్త్రీయంగా వివరించినా సింగిల్ జడ్జి పట్టించుకోలేదు’అని టీజీపీఎస్సీ పేర్కొంది.
వేర్వేరు హాల్‌టికెట్లు సమర్థనీయమే
‘ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వడం సమర్థనీయమే. అలా ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చాం. యూపీఎస్‌సీ విధానాన్ని అనుసరించాలని ఎక్కడా లేదు. పరీక్షా కేంద్రాల సంఖ్య 45 నుంచి 46కి పెరగడంపై పిటిషనర్ల ఆందోళనకు అర్థం లేదు. తొలుత 45 కేంద్రాలుగా నిర్ణయించినా క్షేత్రస్థాయిలో ఒక కేంద్రం ఎత్తైన చోట ఉంది. దీంతో 87 మంది దివ్యాంగుల సౌలభ్యం కోసం సర్దుబాటు చేసే క్రమంలో ఒక పరీక్షా కేంద్రం పెరిగింది’ అని కమిషన్ తెలిపింది.
అనుభవమున్న వారినే ఎంపిక చేశాం: ‘ఫలితాల గణాంకాలను సింగిల్ జడ్జి తప్పుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఒకటోసారి, రెండోసారి మూల్యాంకనం చేశాక 15% కంటే ఎక్కవగా మార్కుల తేడా ఉంటే మూడోసారి మూల్యాంకనం చేసిన విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరి పేపరు మూల్యాంకనం చేస్తున్నామనేది దిద్దేవాళ్లెవరికీ తెలియదు.
అనుభవమున్న, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో నిపుణులైన అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేశాం. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరైనప్పుడు ఒకే తరహా మార్కులు పలువురికి రావడం సర్వసాధారణం. 719 మంది ఒకే రకమైన మార్కులు సాధించడంపై కమిషన్ ఇచ్చిన వివరణను న్యాయమూర్తి పట్టించుకోలేదు’అని టీజీపీఎస్సీ పేర్కొంది.