Hyderabad: హాస్టళ్లపై పోలీసుల ప్రత్యేక దృష్టి.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే

Ten commandments by Police for Entire Hostels in Hyderabad - Sakshi

నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల తనిఖీ  

నిబంధనలు పాటించకపోతే నోటీసులు 

రెండు వారాల్లో పద్ధతి మారకపోతే సీజ్‌ 

గార్డులు, సీసీ కెమెరాలు, రికార్డుల పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల విడుదల ఒకవైపు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కార్యాలయాల పునఃప్రారంభం మరోవైపు.. దీంతో వసతి గృహాలకు పూర్వ వైభవం వచ్చింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో పెయింగ్‌ గెస్ట్‌ (పీజీ) హాస్టళ్లు, వసతి గృహాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. భద్రతా నిబంధనలు పాటించని హాస్టళ్లకు నోటీసులు జారీ చేస్తారు. రెండు వారాల్లో ఆయా ఏర్పాట్లు చేయని వసతి గృహాలను సీజ్‌ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

స్త్రీ, పురుష హాస్టళ్లకు కెమెరాలు ఒకటే 
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 1,200 వసతి గృహాలు ఉన్నాయని, వీటన్నింటినీ మహిళా భదత్రా విభాగం, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు ఎస్సీఎస్సీ జనరల్‌ సెక్రటరీ కృష్ణా ఏదుల తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఎవరు నిర్వహిస్తున్నారనేది కూడా ముఖ్యమే అన్నారు. సైబరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పురుషులు, మహిళల వసతి గృహాల యజమాని  రెండు హాస్టళ్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, అయితే కానీ వాటి రికార్డ్‌ రూమ్ను మాత్రం జెంట్స్‌ హాస్టల్స్‌లోని పురుషులే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. వెంటనే వాటిని సీజ్‌ చేసి, యజమానిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

రాచకొండలో 800 హాస్టల్స్‌.. 
ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 800 వసతి గృహాలు ఉన్నాయని మహిళా భద్రతా విభాగం పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో ఆయా హాస్టళ్లను రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఆర్కేఎస్సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం లేకపోతే నోటీసులు జారీ చేస్తామన్నారు.  

10 నిబంధనలు పాటించాల్సిందే... 
హాస్టల్‌ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద యాక్సెస్‌ కంట్రోల్‌ ఫీచర్లుండాలి. 
కనీసం 5 అడుగుల ఎత్తు, అంతకంటే ఎత్తులో ప్రహరీ ఉండాలి. 
ప్రవేశం ద్వారం వద్ద 24/7 సెక్యూరిటీ గార్డు ఉండాలి. 
విజిటర్స్‌ రిజిస్టర్‌ మెయిన్‌టెన్‌ చేయాలి. 
ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరా ఉండాలి. 
అగ్నిప్రమాద నియంత్రణ ఉపకరణాలు ఉండాలి. 
నోటీసు బోర్డు, ప్రథమ చికిత్స కిట్, ఫిర్యాదులు, సూచనల బాక్స్‌ ఉండాలి. 
వసతి గృహంలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఉండాలి. 
హాస్టల్‌లోని ప్రతి ఒక్కరికీ లాకర్‌ ఉండాలి. 
ధ్రువీకరించుకోకుండా ఎవరికీ వసతిని కల్పించకూడదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top