ప్రైవేటుకు గుడ్‌బై.. సర్కారు బడికి జై 

Telangana: Significantly Increasing New Admissions In Public Schools - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరుగుతున్న కొత్త ప్రవేశాలు 

జూన్‌ నుంచి ఇప్పటివరకు 2.39 లక్షల మంది చేరిక 

ఇందులో ఒకటో తరగతిలోప్రవేశాలే 1.25 లక్షలు 

ప్రైవేటు నుంచి ప్రభుత్వస్కూళ్లలోకి 1.14 లక్షల మంది 

విద్యాసంస్థలు పూర్తిగా తెరిస్తే రెట్టింపు ప్రవేశాలకు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశాల తాకిడి పెరుగుతోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో సర్కారు బడుల్లో చేరుతున్నారు. గతంలో పిల్లలు వివిధ కారణాలతో సర్కారు బడులను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు పొందేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు గుడ్‌బై కొట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు సర్కారు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,39,449 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2021–22 విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు సర్కారు బడుల్లో చేరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థలతో కలిపి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 27.5 లక్షల విద్యా ర్థుల నమోదు ఉండగా.. ఇప్పటికే దాదాపు 10% విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు తీసుకోవడంపై విద్యాశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా దెబ్బ .. ప్రైవేటు బాదుడు 
కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతబడి ఉన్నాయి. కొన్ని రోజులు పాక్షికంగా తెరిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులను ప్రభుత్వం అనుమతించలేదు. ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు బోధన ప్రక్రియంతా ఆన్‌లైన్‌ పద్ధతిలోనే కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇలాగే బోధన జరుగుతున్నా.. ఫీజుల కింద రూ.వేలు డిమాండ్‌ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. బోధన కార్యక్రమాలు అంతంతగానే ఉండటం, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థల వైపే మళ్లుతున్నారు. సర్కారు బడుల్లో సైతం అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటంతో.. మరో ఆలోచన లేకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

ఒకటో తరగతికి బాగా గిరాకీ 
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,39,449 కొత్త అడ్మిషన్లు నమోదు కాగా.. ఇందులో కేవలం ఒకటో తరగతిలోనే 1,25,034 అడ్మిషన్లు జరిగాయి. గత విద్యా సంవత్సరం 12 నెలల కాలంలో ఒకటో తరగతి అడ్మిషన్లు 1,50,071 కాగా.. ఆ సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది రెండు నెలల్లోనే 80 శాతానికి పైగా చేరికలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 1,14,415 మంది ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

వీరంతా ఒకటి నుంచి 12వ తరగతి వరకు వివిధ క్లాసుల్లో అడ్మిషన్లు పొందారు. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు (మోడల్‌ స్కూల్స్‌), పట్టణ ఆశ్రమ పాఠశాలలు (యూఆర్‌ఎస్‌)ల్లో కొత్త చేరికలు జరిగాయి. 2019–20 విద్యా సంవత్సరంలో ఒకటినుంచి 12వ తరగతి వరకు 68,813 కొత్త ప్రవేశాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు మూడున్నర రెట్లు అడ్మిషన్లు జరగడం గమనార్హం. బడులు పూర్తిగా తెరిస్తే రెట్టింపు ప్రవేశాలకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top