
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు
పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
పరిస్థితిని బట్టి మాక్ డ్రిల్ చేపట్టాలి
హైదరాబాద్‌లో సైరన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
జాతీయ వాదాన్ని పెంపొందించేందుకు ర్యాలీలు నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ‘పరిస్థితిని బట్టి 24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేసి మాక్ డ్రిల్, ట్రయల్ వంటివి నిర్వహించాలి. హైదరాబాద్‌లో సైరన్ అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన పరికరాలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలి. ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించడానికి వీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలి..’అని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గురువారం నిర్వహించిన సంఘీభావ ర్యాలీ సమాజానికి మంచి సంకేతాన్ని ఇచ్చిదని అన్నారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సు«దీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి పలు కీలక సూచనలు చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడి చేయాలి
‘అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దుచేయాలి. వార్తా ప్రసారాల్లో తగు జాగ్రత్తల కోసం మీడియా అధిపతులతో సమావేశం నిర్వహించాలి. సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ కట్టడి చేయాలి. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసుపత్రి భవనాల శ్లాబులపై ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ అన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని వివరించారు.
నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్: డీజీపీ
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రత పెంచినట్లు చెప్పారు. రక్షణ రంగానికి చెందిన సంస్థల వద్ద 24 గంటల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, సీసీటీవీలతో మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి పర్యవేక్షించడానికి హెదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రత్యేకంగా యాప్ రూపొందించారని, అలాంటి యాప్ రాష్ట్రంలో తీసుకురావడంపై ఆలోచన చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.