తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ హఠాన్మరణం | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీస్‌ శాఖలో విషాదం.. గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత

Published Tue, Apr 9 2024 8:35 AM

Telangana News: IPS Rajiv Ratan Passed Away - Sakshi

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన రాజీవ్‌ రతన్‌

చికిత్స పొందుతూ కన్నుమూత

మేడిగడ్డ విజిలెన్స్‌ విచారణకు రాజీవ్‌ రతన్‌ సారథ్యం

ఇటీవలె సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన విజిలెన్స్‌ డీజీ

డైనమిక్‌ ఆఫీసర్‌గా పేరు.. సీఎం రేవంత్‌ సహా పలువురి దిగ్భ్రాంతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్ శాఖలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్‌​ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.

రాజీవ్‌ రతన్‌ 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్‌. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేశారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.  కిందటి ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్‌ బాస్‌ రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్‌ డీజీగా ప్రమోషన్‌ పొందారు. 

.. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ డీజీ హోదాలో రాజీవ్‌ రతన్‌ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు మేడిగడ్డ వ్యవహారంపై ఇటీవలె సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్‌ రతన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు. మరోవైపు రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంపై  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు రాజీవే సారధ్యం వహించారు.  సుదీర్ఘ కాలంగా   రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలందించారు.  సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు. రాజీవ్ రతన్ మృతి పట్ల నా సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని సీఎం రేవంత్‌ సంతాప ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement