ఆర్డీఎస్‌ కొన తెల్వదు.. మొన తెల్వదు

Telangana: Minister Singireddy Niranjan Reddy Comments On Bandi Sanjay - Sakshi

బండి సంజయ్‌ది పూర్తిగా అవగాహనా రాహిత్యం

మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం

ఎన్నో ఏళ్ల క్రితం పూర్తయిన ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తారా?

ఎలా పూర్తి చేస్తారో రాసివ్వాలి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, హైదరాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్‌) గురించి కనీస అవగాహన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఆర్డీఎస్‌ కొన తెల్వదు.. మొన తెల్వదు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు..

కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం లేదు.. ఆయన బండి సంజయ్‌ కాదు.. బంగి సంజయ్‌..’ అని విమర్శలు గుప్పించారు. ఆర్‌డీఎస్‌ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు చేపట్టే పనులు, నిధుల సమీకరణపై వివరాలు వెల్లడించడంతో పాటు ఆరు నెలల్లో ఎలా పనులు పూర్తి చేస్తారో కాగితం రాసివ్వాలని సవాలు చేశారు. గద్వాలలో జరిగిన బహిరంగసభలో ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సంబం ధించి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలో ‘తుమ్మిళ్ల’
బండి సంజయ్, బీజేపీ కర్ణాటక కో–ఇన్‌చార్జి డీకే అరుణ ఇద్దరూ కలిసి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు వరకు అంటే 87,500 ఎకరాలకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తుంగభద్రపై 1946లో మొదలై 1956లో పూర్తయిన ఆర్డీఎస్‌ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఎన్నడూ 20 వేల ఎకరాలకు మించలేదన్నారు.

ఆర్‌డీఎస్‌ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003లో కేసీఆర్‌ పాదయాత్ర చేశారని, ఫలితంగా 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటైందన్నారు. ఆర్‌డీఎస్‌ ద్వారా తెలంగాణకు సాగు నీరు అందించడం లేదని కమిటీ నివేదిక ఇచ్చినా ఉమ్మడి పాలకులు స్పందించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. 

50 వేల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల రీ–డిజైన్‌ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్‌ మీద సంపూర్ణ సమీక్ష నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు. 2017లో జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.780 కోట్లతో చేపట్టి ప్రభుత్వం కేవలం పదినెలల్లో పూర్తి చేసిందని వెల్లడించారు.  ఆర్డీఎస్‌ కాల్వ కింద సాగునీరందని 50 వేల ఎకరాలకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తున్నామని..

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని చెప్పారు. పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలి.. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హంద్రీనీవా నీళ్లకు హారతి పట్టిన డీకే అరుణను పక్కనపెట్టుకుని, బండి సంజయ్‌ ఆర్డీఎస్‌ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top