రాష్ట్రంపై సైబర్‌ వల | Telangana Losing Crores to Cyber Frauds | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై సైబర్‌ వల

Apr 13 2026 1:53 AM | Updated on Apr 13 2026 1:53 AM

Telangana Losing Crores to Cyber Frauds

50 నెలల్లో రూ.4,724.63 కోట్లు చోరీ 

ఈ ఏడాది రెండు నెలల్లోనే రూ.257.35 కొల్లగొట్టిన కేటుగాళ్లు 

2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితులకు తిరిగి ఇప్పించింది రూ.382.8 కోట్లు 

యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ ఆర్టీఏ దరఖాస్తుకు..జవాబిచ్చిన టీజీ సీఎస్‌బీ  

సాక్షి, హైదరాబాద్‌: అత్యాశ కొందరిది..అమాయకత్వం మరికొందరిది. కారణం ఏమైనా..అందనంత దూరంగా ఉంటూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు. రాష్ట్ర పరిధిలో నమోదైన సైబర్‌ నేరాల్లో కేవలం నాలుగేళ్ల రెండు నెలల్లోనే రూ.4724.63 కోట్లు చోరీ చేశారు. నెలకు దాదాపు రూ.94 కోట్లకు పైనే కొల్లగొడుతున్నారు. కేవలం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సైబర్‌ కేటుగాళ్లు రూ.257.35 కోట్లు దోచేశారు.

తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌ నేరాల వివరాలు ఇవ్వాలని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ ఫౌండర్‌ రాజేంద్ర పల్నాటి వేసిన ఆర్టీఐ దరఖాస్తునకు సమాధానంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో( టీజీ సీఎస్‌బీ) ఈ వివరాలు వెల్లడించింది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

బాధితులు పోగొట్టుకున్న సొత్తును దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్‌ చేయడంతోపాటు తిరిగి ఇప్పిస్తున్నట్టు తెలిపారు. అయితే అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పోగొట్టుకున్న సొత్తు రూ.4724.63 కోట్లు కాగా, బాధితులకు ఇప్పటి వరకు రీఫండ్‌ చేయించిన మొత్తం రూ.382.8 కోట్లుగా అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement