
వర్షాకాల సమావేశాలు నేటితో ముగించాలని నిర్ణయం
బీఏసీ సమావేశంలో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆదివారం సభ ముందుకు ‘కాళేశ్వరం’పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు.. చర్చ
ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతకు సంబంధించిన బిల్లులు
ప్రజా సమస్యలపై 15 రోజుల పాటు చర్చించాలని బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రతిపాదన
ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్‌ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు ఆదివారంతోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే కొద్ది విరామం తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించక పోవడంతో భేటీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది.
కాళేశ్వరం నివేదిక సమర్పించనున్న సీఎం
ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు సమర్పిస్తారు. దీనిపై చర్చ అనంతరం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై కూడా సభలో చర్చిస్తారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ సవరణలు ప్రతిపాదిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 (ఎ)కు సవరణల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీపీటీకి బీఆర్‌ఎస్ పట్టు
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని బీఏసీ భేటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ విజ్ఞాపనను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు తదితర ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో బీఆర్‌ఎస్ ప్రతిపాదించింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి బీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో పాటు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు.