
కేంద్రం మార్గదర్శకాల మేరకు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పైలట్ పద్ధతిలో 5 గ్రామాల ఎంపిక.. 3 ఏజెన్సీలకు బాధ్యతలు
ఇప్పటికే పూర్తయిన గ్రామాల సరిహద్దుల సర్వే
కొత్త సమస్యలు వస్తాయేమోనని రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్‌ఆర్‌ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.
ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్‌మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.
గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ..
భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆ గ్రామానికి నక్ష లేదు!
భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.
అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.
ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు.
ఏమవుతుందో... ఏమో?
భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్‌లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్‌లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.
కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్‌లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్‌లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు.