నిమ్స్, ఎయిమ్స్ తరహా ప్రత్యేక హోదాపై కానరాని స్పష్టత
అటకెక్కిన టిమ్స్ కోసమే నియామకాలు జరపాలన్న ప్రతిపాదన
ఇతర ఆస్పత్రుల నుంచి తాత్కాలికంగా డాక్టర్లు, సిబ్బందితో ట్రయల్ రన్
కనీసం 4 వేల మందిని నియమిస్తే తప్ప సాధ్యం కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులకు మానవ వనరుల కల్పనే ప్రధాన సమస్యగా తయారైంది. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా, విదేశీ రోగులను ఆకర్షించేలా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘టిమ్స్’లో ఆ స్థాయి వైద్య సేవలు అందించే స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం ఇప్పటి వరకు జరగలేదు.
నిమ్స్, ఎయిమ్స్ తరహాలో ప్రత్యేక డైరెక్టరేట్, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, స్వతంత్ర నియామకాలతో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్పినా, ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో కార్డియాక్ స్పెషాలిటీగా సనత్‌నగర్ టిమ్స్‌ను తొలి దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీలు మారగా, తాజాగా జూన్ 2న ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా వాయిదా పడింది. సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకొని జూన్ రెండోవారంలో ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
అటకపైకెక్కిన ప్రత్యేక నియామకాలు
టిమ్స్ ఆస్పత్రులను (Telangana Institute of Medical Sciences) సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి భిన్నంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా డైరెక్టరేట్ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసి, నేరుగా ఈ ఆస్పత్రుల కోసమే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఒక్కో టిమ్స్ ఆస్పత్రికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 4 వేల మందిని నియమించాలని ప్రతిపాదించారు.
అయితే వైద్య, నర్సింగ్, టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదని తెలిసింది. దీంతో ప్రత్యేక నియామకాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక డైరెక్టరేట్ కింద టిమ్స్ నిర్వహించాలని భావించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఆస్పత్రిలో ట్రయల్ రన్ కోసం గాంధీ, ఉస్మానియాతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్పత్రుల నుంచి కొందరు వైద్యులు, ఇతర సిబ్బందిని తాత్కాలికంగా సనత్‌నగర్ టిమ్స్‌కు తరలించి ‘ట్రయల్‌రన్’నిర్వహిస్తున్నారు.
కనీసం 4 వేల మంది వైద్య సిబ్బంది అవసరం...
1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణకు కనీసంగా 200 మంది స్పెషలిస్టు వైద్యులు, 500 మంది రెసిడెంట్ డాక్టర్లు, మూడు షిప్ట్‌ల్లో పనిచేసేందుకు 1,500 వరకు స్టాఫ్ నర్సులు, 1500–2000 మంది పారా మెడికల్ సిబ్బంది అవసరం ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి కార్డియాక్ కేర్, ఐసీయూలు, ట్రామా కేర్, క్యాథ్‌ల్యాబ్‌లు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి అత్యాధునిక విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే అనుభవజ్ఞులైన సిబ్బంది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం 4 వేల మంది వరకు నేరుగా నియమిస్తే తప్ప, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
చదవండి: వడివడిగా ఫ్యూచర్ సిటీవైపు అడుగులు


