
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. అల్పపీడన ప్రభావంతో నగరాన్ని భారీ వాన ముంచెత్తింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
మరోవైపు మంగళవారం ఉదయం కూడా వాన జోరు కొనసాగుతోంది. దీంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. మరో రెండ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.