‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Telangana High Court Serious Over Siddipet Collector Comments On Paddy - Sakshi

విత్తనాల విక్రయాన్ని అడ్డుకోరాదని స్పష్టీకరణ

సిద్దిపేట కలెక్టర్‌ వ్యాఖ్యలు క్రిమినల్‌ కోర్టుధిక్కరణే 

తగిన చర్యలకు సీజే ముందుంచాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి చేసిన మౌఖిక వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా మెజి్రస్టేట్‌గా ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారే.. చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది.

వరిని విక్రయించిన దుకాణాలను తెరవాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా తాను లెక్కచేయనంటూ కలెక్టర్‌ చేసిన పేర్కొనడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్‌ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్‌ చేస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ‘జిల్లా మెజి్రస్టేట్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం క్రిమినల్‌ కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది. భవిష్యత్తులో కలెక్టర్‌కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కలెక్టర్‌పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
(చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్‌.. గాంధీ భవన్‌లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top