ఇష్టమొచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లా? | Telangana High Court impatience on police conduct | Sakshi
Sakshi News home page

ఇష్టమొచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లా?

Sep 11 2025 1:35 AM | Updated on Sep 11 2025 1:35 AM

Telangana High Court impatience on police conduct

పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం

సోషల్‌ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా? 

సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? 

రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి 

పోలీసుల తీరుతో కేసులు, కోర్టుల్లో పిటిషన్లు పెరుగుతున్నాయని వ్యాఖ్య 

ఇష్టారాజ్యంగా, ఆటోమేటిక్‌గా, మెకానికల్‌గా అరెస్టులు అనుమతించబడవని స్పష్టీకరణ... కేసు నమోదుకు 

ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మరిచిపోవద్దంటూ హితవు 

నల్లబాలుపై 3 పోలీస్‌స్టేషన్లలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో, సోషల్‌ మీడియాలో చేసిన విమర్శలు ఆధారంగా చేసుకుని ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియాలో విమర్శలు చేసినా.. సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తారా అని నిలదీసింది. కనీస చట్టాలు పట్టించుకోరా?.. సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించింది. 

కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సూచనలు తీసుకోవాలని సూచించింది. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మరిచిపోవద్దని హెచ్చరించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన సోషల్‌ మీడియా పోస్టులను రీ పోస్టు చేసిన దుర్గం శశిధర్‌గౌడ్‌ అలియాస్‌ నల్లబాలుపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చింది.   

కేసు పూర్వాపరాలు.. 
సోషల్‌ మీడియా (ఎక్స్‌)లో కాంగ్రెస్‌ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లబాలుపై పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ‘నో విజన్‌.. నో మిషన్, ఓన్లీ ట్వంటీ పర్సంట్‌..’, ‘రాష్ట్రానికి తెగులు–కాంగ్రెస్‌ కీడు’, ‘సీఎం రేవంత్‌రెడ్డిది 20 పర్సంట్‌ కమీషన్‌ పాలన’, ‘ప్రభుత్వానికి విజన్‌ లేదు–మిష¯న్‌ లేదు..’ వంటి పోస్టులకు సంబంధించి ఈ మూడు కేసులు పెట్టారు. 

నల్ల బాలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన 20 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం, కరీంనగర్, గోదావరిఖని–1 పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ నల్ల బాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ తుకారాంజీ విచారణ చేపట్టారు.  

రాజకీయ విమర్శలపై కేసులా?: పిటిషనర్‌ తరఫు న్యాయవాది 
పిటిషనర్‌ తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు. ‘నల్ల బాలువి క్రిమినల్‌ చర్యలు కావు. రాజకీయ విమర్శలు. దీనికే హింస, దురుద్దేశం, అల్లర్లు సృష్టించే పోస్టులంటూ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టించింది. పోలీసులు బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) చట్టంలోని సెక్షన్లు 192, 352, 353 కింద కేసులు నమోదు చేయడం చెల్లదు. ఒకవేళ పిటిషనర్‌ పెట్టిన పోస్టులతో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటే నేరుగా సీఎం లేదా ఆయన పార్టీ ఫిర్యాదు చేయాలి తప్ప ఇతరులు కాదు. 

థర్డ్‌ పార్టీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడం చట్ట విరుద్ధం..’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘నల్ల బాలు ఇలాంటి ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. కావాలని సీఎంను కించపరుస్తూ, ప్రజల్లో సీఎంపై ఆగ్రహం కలిగించేలా పోస్టులు పెట్టారు. కేసుల విచారణను కొనసాగించాలి..’ అని కోరారు.  

కేసుల కొట్టివేత..పోలీసులకు సూచనలు 
వాదనల అనంతరం నల్ల బాలుపై రామగుండం సీసీపీఎస్, కరీంనగర్‌ సీసీపీఎస్, రామగుండం జీడీకే–1 స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయమూర్తి కొట్టేశారు. ఈ సందర్భంగానే పోలీసుల తీరును ఆయన ప్రశ్నించారు. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 

– పరువు నష్టం కేసులు నమోదు చేసే ముందు ఫిర్యాదుదారుడు చట్టపరంగా బాధిత వ్యక్తేనా?.. అనేది పోలీసులు ధ్రువీకరించుకోవాలి.  
– కాగ్నిజబుల్‌ (అరెస్టు చేయదగిన) నేరాల్లో తప్ప ఇతర కేసుల్లో సంబంధం లేని మూడో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే అది చెల్లదు.  
– కాగ్నిజబుల్‌ కేసుల విషయంలో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయో.. లేదో దర్యాప్తు చేయాలి.  
– హింస, ద్వేషం, ప్రజల్లో అశాంతిని ప్రేరేపించడానికి సంబంధించి ప్రాథమిక అంశాలు లేనట్లయితే.. ప్రజా శాంతికి ముప్పు, దేశద్రోహం వంటి కేసులను నమోదు చేయవద్దు. 
– కేదార్‌నాథ్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు, శ్రేయ సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న సూత్రాలను పాటించాలి 
– కఠినమైన, అభ్యంతరకరమైన, విమర్శనాత్మక రాజకీయ ప్రసంగానికి సంబంధించిన కేసులను పోలీసులు యాంత్రికంగా నమోదు చేయవద్దు.  
– ప్రసంగం హింసను ప్రేరేపించేలా లేదా ప్రజా శాంతికి తక్షణ ముప్పుగా ఉన్నప్పుడు మాత్రమే క్రిమినల్‌ చట్టాన్ని ప్రయోగించాలి.  
– రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద.. రాజకీయ విమర్శకు రక్షణ ఉంది.  
– పరువు నష్టం అనేది నాన్‌ కాగ్నిజబుల్‌ నేరంగా పరిగణించినప్పుడు పోలీసులు నేరుగా క్రిమినల్‌ కేసు నమోదు చేయలేరు.  
– ఫిర్యాదుదారుడిని మెజిస్ట్రేట్‌ను సంప్రదించమని చెప్పాలి. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 174(2) కింద మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు మాత్రమే పోలీసు చర్య తీసుకోవాలి. 
– ఇష్టారాజ్యంగా, ఆటోమెటిక్‌గా, మెకానికల్‌గా అరెస్టులు అనుమతించబడవు.  
– అర్నేశ్‌కుమార్‌ వర్సెస్‌ బిహార్‌ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే.  
– ఫిర్యాదు అనవరమైనది, రాజకీయ ప్రేరేపితం అని తేలితే.. దర్యాప్తునకు తగిన కారణాలు లేవంటూ బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 176(1) కింద పోలీసులు దాన్ని మూసివేయాలి.  
 
చెంపపెట్టు లాంటి తీర్పు: కేటీఆర్‌ 
‘బీఆర్‌ఎస్‌ పార్టీ ట్వీట్లను రీట్వీట్‌ చేసినందుకు శశిధర్‌ గౌడ్‌పై అక్రమ కేసులు నమోదు చేయించిన ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో ప్రభుత్వాలు అడ్డగోలుగా కేసులు పెడుతున్నాయి. గత 21 నెలలుగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టి కాంగ్రెస్‌ వేధిస్తోంది. ఈ వేధింపులు ఇకనైనా ఆపి.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలి. బీఆర్‌ఎస్‌ పార్టీ తన కార్యకర్తలకు, కేసీఆర్‌ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది..’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement