ట్రాన్స్‌జెండర్లకు ‘ఆసరా’ఇవ్వండి 

Telangana High Court Asks State To Look Transgenders Plea For Aasara Pension - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులందకీ ఇస్తున్నట్లే ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆసరా పింఛన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు జీవో నంబర్‌ 17లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బియ్యం, ఉచిత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లాంటి సౌకర్యాలు అందడం లేదని.. వారికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి పథకాలు అందేలా చూడాలని కోరుతూ.. వైజయంతి వసంత మోగ్లీ అలియాస్‌ ఎం.విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సీఎస్‌ సహా వైద్యారోగ్య, సివిల్‌ సప్లయ్, హోం, ఆర్థిక, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జైనాబ్‌ వాదనలు వినిపించారు. ట్రాన్స్‌జెండర్లకు ఆధార్‌ సహా ఇతర గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో 58,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా, 12,000 మందికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారని చెప్పారు. కర్ణాటక, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని... రాష్ట్రంలోనూ వారి కోసం పథకాలు అమలు చేసేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది రాధివ్‌రెడ్డి వాదిస్తూ ట్రాన్స్‌జెండర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్‌ చేపట్టామని చెప్పారు. పిటిషన్‌ వేసే నాటికి 12,000 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినా.. ప్రస్తుతం దాదాపు అందరికీ పూర్తయిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ట్రాన్స్‌జెండర్లకు అసరా వర్తింజేయాలంటూ విచారణను అక్టోబర్‌ 19కి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top