రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఝలక్.. కేటీఆర్‌ పిటిషన్‌కు ఓకే

Telangana HC Dismiss Revanthreddy NGT Petition Against KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ/మీర్జాగూడలో హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో జీవో 111 రూల్స్‌ను ఉల్లంఘించి ఐటీ మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌ కట్టారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) చెన్నై బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చింది. 

అర్హత లేని పిటిషన్‌లో సంయుక్త కమిటీ దర్యాప్తునకు ఆదేశించడం సరికాదని స్పష్టం చేసింది. రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను, ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కేటీఆర్, ఫామ్‌హౌస్‌ యజమాని ప్రదీప్‌రెడ్డి విడివిడిగా వేసిన రిట్లను అనుమతిస్తూ జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావ్‌ల డివిజన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు చెప్పింది. ఎన్‌జీటీ రూల్స్‌ ప్రకారం నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోగా ఎవరైనా ఫిర్యాదు చేయాలని, అయితే ఏనాడో నిర్మాణం జరిగిన దానిపై రేవంత్‌ పిటిషన్‌ వేస్తే దానిని ఎన్‌జీటీ విచారించే అర్హత లేదని చెప్పింది. పైగా, కేటీఆర్‌ ఆ నిర్మాణం చేయలేదని, ఆ భూమికి యజమాని కూడా కాదని చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చింది. 

‘కేటీఆర్‌కు నోటీసు కూడా జారీ చేయకుండా నేరుగా ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదు. నోటీసు ఇవ్వకుండా సంయుక్త కమిటీ ఏర్పాటు చెల్లదు. ఫాం హౌస్‌ ఓనర్‌ ప్రదీప్‌రెడ్డిని ప్రతివాదిగా చేయకుండా రేవంత్‌ ఎన్‌జీటీలో పిటిషన్‌ వేసి ఉత్తర్వులు పొందడం చెల్లదు’అని పేర్కొంటూ.. ఎన్‌జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలేగానీ హైకోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదన్న రేవంత్‌ వాదనను తిరస్కరించింది. ఎన్‌జీటీ ఉత్తర్వులపై జోక్యం చేసుకునే పరిధి హైకోర్టులకు కూడా ఉంది. ఇద్దరి పిటిషన్లను అనుమతిస్తున్నాం.. అని తీర్పులో పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top