సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలను ఆర్థిక శాఖ చెల్లించింది.
గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ మార్చి 2026 వరకు ప్రతి నెలా చెల్లింపులు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి నెలవారీ కేటాయింపును రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు రూ.1000 కోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా తీర్చింది. దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించింది.
ఉద్యోగుల ఆరోగ్య అవసరాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య బిల్లులు ఒక్కరోజు ఆలస్యం లేకుండా, అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ చర్యలతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఊరట లభించింది.


