GHMC: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్లాట్లపై వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌!

Telangana Govt Impose Vacant Land Tax On LRS Plots - Sakshi

పురపాలక శాఖ నిర్ణయం 

అప్రూవ్డ్‌ లేఅవుట్లలోని ప్లాట్లపై సైతం.. 

మార్కెట్‌ విలువలో ఏటా 0.05–0.20% పన్ను  

పన్ను పరిధిలోకి 14.75 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు 

క్రమబద్ధీకరించే సమయంలోనే విధించనున్న పురపాలికలు

సాక్షి, హైదరాబాద్‌: అప్రూవ్డ్‌ లేఅవుట్లలోని ప్లాట్లతోపాటు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లపై వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (ఖాళీ స్థలాల పన్ను) పడబోతోంది. ఈ రెండు కేటగిరీల ప్లాట్లు వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ స్పష్టం చేసింది. నిర్మాణాలకు అనువైన/ నిర్మాణాలు అనుమతించదగిన ఖాళీ స్థలాలపై వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 సెక్షన్‌ 94(ఏ) పేర్కొంటోందని, ఆయా ప్లాట్లపై ఈ మేరకు వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ విధించాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు (జీహెచ్‌ఎంసీ మినహా), మున్సిపాలిటీల కమిషనర్లను తాజాగా పురపాలక శాఖ డైరెక్టరేట్‌ ఆదేశించింది. లేఅవుట్ల అప్రూవల్స్‌ జారీ/ ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించే సమయంలో సంబంధిత ఖాళీ స్థలాల మదింపు (అసెస్‌మెంట్‌) చేసే సమయంలో ఈ పన్ను విధించాలని కోరింది. 

మార్కెట్‌ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా.. 
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన మార్కెట్‌ విలువ ఆధారంగా ప్లాట్‌ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా, 0.20 శాతానికి మించకుండా వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల నిబంధనలు–2020 చెబుతు న్నాయి. ఈ మేరకు పన్ను విధించే అంశాన్ని సం బంధిత మున్సిపాలిటీల పాలక మండలి ముందు ఉంచి ఆమోదం పొందాలని మున్సిపల్‌ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఈ పన్ను రేట్లను సైతం శాఖ పోర్టల్‌లో నవీకరించాలని కోరింది.

మదింపు చేపట్టి అడ్వాన్స్‌గా... 
రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గతేడాది ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)–2020 ప్రవేశపెట్టగా, గడువులోగా మొత్తం 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామ పంచాయతీల పరిధి నుంచి 10.83 లక్షలు, మున్సిపాలిటీల పరిధి నుంచి 10.60 లక్షలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 4.16 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లపై వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న 14.75 లక్షలకు పైగా ప్లాట్లు/లేఅవుట్ల యజమానులపై సమీప భవిష్యత్తులో ఈ మేరకు పన్నులు విధించే అవకాశాలున్నాయి. ఆయా ప్లాట్‌ క్రమబద్ధీకరణ ప్రక్రియ సమయంలోనే పన్నుల మదింపు సైతం చేపట్టి అడ్వాన్స్‌గా పన్నులు కట్టించుకోనున్నట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.

చదవండి: హమ్మయ్య.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉపశమనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top