కొత్త థర్మల్‌ ప్లాంట్లపై వెనక్కి! 

Telangana Government Rethink Over Thermal Power Plant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం విషయంగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర అవసరాలుపోగా విద్యుత్‌ మిగులు కూడా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కొత్త థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని విరమించుకోవాలనే భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది.

సింగరేణి సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ను నిర్మించింది. విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణానికి 2019 డిసెంబర్‌ 18న కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇంకా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

అందులో తొలిదశ కింద 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను రామగుండంలో చేపట్టారు. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్‌ కట్టాల్సి ఉంది. ఎన్టీపీసీ దీనికి పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటివరకు దరఖాస్తే చేసుకోలేదు. రెండోదశ ప్లాంట్‌కు సంబంధించి ఇంతవరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు లేవని ఎన్టీపీసీ అధికారవర్గాలు తెలిపాయి. 800 మెగావాట్ల సింగరేణి, 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు కనిపిస్తున్నా.. కొద్దిరోజులుగా విద్యుత్‌ రంగంలో జరుగుతున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులోనూ వాటిని చేపట్టే అవకాశాలు తక్కువని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.  

భారీగా అందుబాటులోకి.. 
ప్రస్తుతం రాష్ట్రంలో.. 3,772.5 మెగావాట్ల తెలంగాణ జెన్‌కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,645 మెగావాట్ల కేంద్ర ప్లాంట్లు, 839 మెగావాట్ల సెమ్‌కాబ్‌ (ప్రైవేటు) కలిపి మొత్తం 8,456 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులో ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న 270 మెగావాట్ల భద్రాద్రి, 4 వేల మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర థర్మల్‌ విద్యుత్‌ సరఫరా సామర్థ్యం 14,326.5 మెగావాట్లకు పెరుగుతుంది.

దీనికి అదనంగా 2,531.76 మెగావాట్ల జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రాలు, 3,472 మెగావాట్ల సౌర, 128 మెగావాట్ల పవన విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా థర్మల్, హైడల్, సోలార్, విండ్‌ ప్లాంట్లు అన్నీ కలిపి దాదాపు 25 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. 

పెట్టుబడి గిట్టుబాటు కాదు.. 
కాళేశ్వరం, పాలమూరు వంటి కొత్త ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్రంలో 8వేల మెగావాట్ల మేర విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. 2022–23 నాటికి పూర్తికానున్న యాదాద్రి, ఎన్టీపీసీ ప్లాంట్లతో ఈ డిమాండ్‌ తీరిపోయి, ఇంకా మిగులు విద్యుత్‌ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఆశించిన మేర విద్యుత్‌ డిమాండ్‌ పెరగకపోతే.. కొత్త థర్మల్‌ ప్లాంట్లపై పెట్టే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల కొత్త థర్మల్‌ ప్లాంట్లు చేపట్టకపోవడమే మేలు అని చెప్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top