రెండేళ్లలో కొత్తగా 2,400 ఎంబీబీఎస్‌ సీట్లు

Telangana Government Focused On Medical Education - Sakshi

వచ్చే ఏడాది 1,200, తదుపరి ఏడాది మరో 1,200 సీట్లు 

రాష్ట్రంలో మరింత మంది వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యపై దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ పర్యవేక్షిస్తుండటంతో కొత్త వైద్య కళాశాల విషయంలో ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎక్కువమంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు అవకాశం దక్కనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ కళాశాలలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్ల గొండ, సూర్యాపేటల్లో కొత్త కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో కలిపి ప్రస్తుతం 9 ప్రభుత్వ వైద్య కళాశాల లున్నాయి. వాటిల్లో 1,640 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో..మొదటి ఏడాది 1,200, రెండో ఏడాది 1,200 సీట్ల చొప్పున మొత్తం 2,400 ఎంబీబీఎస్‌ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.  

ఒక్కో కాలేజీలో 150 సీట్లు 
2022–23లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌ కర్నూల్, రామగుండంలో కాలేజీలు ఏర్పాటు చేస్తారు. 2023–24లో వికారాబాద్, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లోనూ కొత్తగా వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఒక్కో మెడికల్‌ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 28వ తేదీన ముందుగా 8 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 8 కళాశాలలకు వచ్చే సంవత్సరం దరఖాస్తు చేస్తారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top