కరోనా ఉధృతి.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం! | Sakshi
Sakshi News home page

కరోనా ఉధృతి.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!

Published Thu, Apr 1 2021 3:52 AM

Telangana Government Allowed to Private Hospitals Conduct COVID  RTPCR Tests - Sakshi

హైదరాబాద్‌: వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చేవారిలో అవసరమైన అందరికీ ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో కరోనా పరీక్ష తప్పనిసరిగా చేయాలని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. తీవ్ర శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, కరోనా లక్షణాలు లేకుండా ఆస్పత్రిలో చేరే హైరిస్క్‌ రోగులకు, వివిధ రకాల శస్త్రచికిత్సలు, సాధారణ వైద్యం కోసం వచ్చే లక్షణాలు లేని రోగులకు, ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కూడా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 శాతంగానే ఉన్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను 40 శాతానికిపైగా పెంచేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. 

నేడు మంత్రి ఈటల మీటింగ్‌ 
కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్‌ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మంత్రి బుధవారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సలపై సమీక్షిం చారు. కరోనా పరీక్షలను సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

కేసుల సంఖ్య పెరుగుతున్నా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వ్యాక్సినేషన్‌ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. అయితే అందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.   

Advertisement
Advertisement