ఏకంగా 1,35,75,687 ఎకరాల్లో పంటలు వేసిన తెలంగాణ రైతులు

Telangana Farmers Creates All Time Record In Kharif Cultivated Area - Sakshi

ఈసారి రికార్డు స్థాయిలో వరి వేసిన అన్నదాతలు

ఇప్పటికి 64.31 లక్షల ఎకరాల్లో నాట్లు 

పత్తికి వర్షం దెబ్బ.. 50 లక్షల ఎకరాలకు చేరువవుతున్న వైనం

లక్ష్యం చేరని కంది.. అధిగమించిన సోయాబీన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో.. తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత భారీ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 2020 ఖరీఫ్‌లో 1,35,63,492 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేశారు. అప్పటికది ఆల్‌టైమ్‌ రికార్డు కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటికి 1,35,75,687 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీంతో 2020 నాటి రికార్డును తిరగరాసినట్టయ్యింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 1.03 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగు విస్తీర్ణం, ఆ తర్వాత నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఈ ఏడాది గణనీయంగా పెరగడం విశేషం.

సీజన్‌ ఇంకా ఉండటంతో ప్రస్తుత విస్తీర్ణం మరింత పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి వరి కూడా రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఈ పంట ప్రతిపాదిత సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలే. కానీ ఏకంగా 64.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇంకా ఈ నెలాఖరు వరకు నాట్లు పడతాయని భావిస్తున్నారు. గతేడాది (2021) వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది.

లక్ష్యం 1.43 కోట్ల ఎకరాలు..
ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బుధవారం నాటికే 1,35,75,687 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కావడం, కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, చెరువులు నిండటం, మంచి వర్షాలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమయ్యాయి. అత్యధికంగా వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గుచూపగా కంది, సోయాబీన్‌ ఇతర పంటలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

49.98 లక్షల ఎకరాల్లో పత్తి
వాస్తవానికి ఈసారి పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు. పత్తికి గతేడాది మార్కెట్లో గణనీయంగా ధర పలకడంతో ఈసారి దానివైపు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పత్తి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కీలక సమయంలో కురిసిన భారీ వర్షాలు పత్తి సాగుపై ప్రభావం చూపించాయి.

అప్పటికే వేసిన పత్తి పంట లక్షలాది ఎకరాల్లో మునిగి పాడై పోయింది. చాలా ప్రాంతాల్లో రెండోసారి వేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు 49.98 లక్షల ఎకరాలకే పత్తి పరిమితమయ్యింది. దీంతో ఊపందుకున్న వరి రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఇక కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.61 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్‌ లక్ష్యం 3.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.33 లక్షల ఎకరాల్లో వేశారు. 

26 జిల్లాల్లో వంద శాతానికిపైగా సాగు
    రాష్ట్రంలో 26 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్‌ పంటలు సాగయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్, మెదక్‌ జిల్లాల్లో 139 శాతం చొప్పున పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లాలో 84 శాతం సాగైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 107 శాతం, ఆసిఫాబాద్‌ జిల్లాలో 119 శాతం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 112 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 104, పెద్దపల్లి 105, జగిత్యాల 115, రాజన్న సిరిసిల్ల 119, సంగారెడ్డి 115, వరంగల్‌ 106, హనుమకొండ 103, జనగాం 126, భద్రాద్రి కొత్తగూడెం 113, వికారాబాద్‌ 116, మహబూబ్‌నగర్‌ 117, నారాయణపేట, యాదాద్రి జిల్లాల్లో 110, వనపర్తి 102, గద్వాల 100, నల్లగొండ 114, సూర్యాపేట 116 శాతం చొప్పున పంటలు సాగయ్యాయి.

పుష్కలంగా నీరు, కరెంటు
వానాకాలం పంటల సాగు తెలంగాణలో ఆల్‌టైం రికార్డు సాధించింది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. 
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top