27న సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ | Telangana Engineering Seats Allocation Will Be End By Tomorrow | Sakshi
Sakshi News home page

27న సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

Nov 23 2021 1:05 AM | Updated on Nov 23 2021 1:05 AM

Telangana Engineering Seats Allocation Will Be End By Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చివరిదశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు బుధవారం పూర్తవుతుంది. సీట్లు దక్కే విద్యార్థులు ఈ నెల 27న సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రెండు దశలుగా కౌన్సెలింగ్‌ చేపట్టారు. తొలిదశలో 78,270 సీట్లు అందుబాటులో ఉంటే, ఆప్షన్లు ఇచ్చినంత వరకూ 61,169 సీట్లు కేటాయించారు.

అయితే తొలి దశలో 46,322 మంది మాత్రమే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. రెండో దఫా కౌన్సెలింగ్‌లో 59,993 సీట్లు కేటాయించారు. ఇందులో కొత్తగా అనుమతి వచ్చిన కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూప్, దాని అనుబంధ కోర్సుల సీట్లు 4 వేలకుపైగా ఉన్నాయి. రెండో దశలో సీట్లు పొందిన వారిలో 53,717 మంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. ఈ దఫా 6,278 సీట్లు మిగిలాయి. మొత్తంగా 26,073 సీట్లు మిగిలాయి. 

శని, ఆదివారాల్లో ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌  
ఉన్నత విద్యామండలి శని, ఆదివారాల్లో ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించింది. ఆఖరి దఫా కౌన్సెలింగ్‌ కావడంతో దాదాపు 25 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. రెండోదశలో సీట్లు పొందినవాళ్లు మంచి కోర్సులు, కాలేజీల కోసం ఆప్షన్లు ఇచ్చారు. మూడు దశల్లోనూ కంప్యూటర్‌ సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సుల సీట్లనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నారు.

దీంతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో 3,629, మెకానికల్‌లో 3,980 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 3,847 సీట్లు మిగిలాయి. ప్రత్యేక రౌండ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్‌ కోర్సులను మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ను పెట్టుకున్నారు. ఈ లెక్కన ఈసారి కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ వివరాలను కాలేజీలు ఈ నెలాఖరులోగా ఉన్నత విద్య మండలికి సమర్పించాల్సి ఉంటుంది.    

Advertisement
 
Advertisement
Advertisement