వేద పాఠశాలకు భూమిపూజ | Telangana CM launches Rs 99. 55 crore projects at Yadagirigutta Temple | Sakshi
Sakshi News home page

వేద పాఠశాలకు భూమిపూజ

May 24 2026 1:24 AM | Updated on May 24 2026 1:24 AM

Telangana CM launches Rs 99. 55 crore projects at Yadagirigutta Temple

శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ, సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మండలి చైర్మన్‌ గుత్తా, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి

యాదగిరిగుట్టలో రూ. 99.55 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో కార్యక్రమం 

అనంతరం దైవదర్శనం చేసుకున్న సీఎం, మంత్రులు 

సీఎం టూర్‌లో ప్రొటోకాల్‌ వైఫల్యం.. వేరేచోట ల్యాండైన హెలికాప్టర్‌ 

తల్లకిందులైన షెడ్యూల్‌.. దీంతో శంకుస్థాపన చేశాక  దైవదర్శనం చేసుకున్న రేవంత్‌

సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులన్నింటికీ ఒకేచోట పెద్దగుట్టపై శిలాఫలకం వేశారు. అందులో ప్రధానమైనది వేద పాఠశాల. వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతిస్వామి వేద ఆశీర్వచనం అనంతరం అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు.

సీఎంతోపాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నృసింహుని దర్శించుకున్న సీఎం రేవంత్‌ 
అభివృద్ధి పనులకు భూమిపూజ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కొండపైకి కాన్వాయ్‌లో చేరుకున్నారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం నుంచి, త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అర్చక బృందం, వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలకగా మొ¬దట ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ప్రధానాలయంలోని స్వయంభూలను, ఉత్సవ మూర్తులను దర్శించుకుని రేవంత్‌ పూజలు నిర్వహించారు. వేదపండితులు ప్రధానాలయం ముఖమండపంలో సీఎంకు వేదాశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్, ఆలయ ఈవో భవాని శంకర్‌ స్వామివారి జ్ఞాపికను సీఎంకు అందజేశారు. వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం సీఎం పశ్చిమ రాజగోపురం గుండా ఆలయం నుంచి బయటకు వచ్చారు.  

గోశాల స్థలంలో బదులు పెద్దగుట్టపై దిగిన సీఎం హెలికాప్టర్‌ 
సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్‌ వైఫల్యం చోటుచేసుకుంది. సీఎం, మంత్రులు ఉన్న హెలికాప్టర్‌ ప్రొటోకాల్‌ ప్రకారం నిర్దేశిత యాదగిరిగుట్ట గోశాల స్థలంలో ల్యాండ్‌ కావాల్సి ఉండగా దానికి బదులు పెద్దగుట్టపై దిగింది. అక్కడ స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, భద్రతా అధికారులు ఎవరూ లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు 10 నిమిషాలపాటు హెలికాప్టర్‌లోనే వేచి చూశారు. అనంతరం హెలికాప్టర్‌ దిగిన సీఎం.. కాన్వాయ్‌ లేకుండా అక్కడున్న సాధారణ పోలీసులతోనే కాలినడకన సుమారు 300 మీటర్లు నడుచుకుంటూ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. 

మరోవైపు హెలికాప్టర్‌ మరోచోట దిగడంతో సీఎం షెడ్యూల్‌ మారిపోయింది. వాస్తవ షెడ్యూల్‌ ప్రకారం కొండ కింద హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాగానే కాన్వాయ్‌తో సీఎం రేవంత్‌ కొండపైకి చేరుకోవాలి. అక్కడ దైవదర్శనం అనంతరం పెద్దగుట్ట (టెంపుల్‌ సిటీ)లో వేద పాఠశాలకు భూమిపూజ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలి. అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో అల్పాహారం చేసి హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌ వెళ్లాలి. కానీ హెలికాప్టర్‌ పెద్దగుట్టపై ల్యాండ్‌ కావడంతో సీఎం ముందుగా శంకుస్థాపన నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు.

ఆపై అల్పాహారం చేయకుండానే హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోయారు. గత సీఎం కేసీఆర్‌ యాదగిరిగుట్ట పర్యటనల సందర్భంగా హెలికాప్టర్‌లో పలుమార్లు పెద్దగుట్టపై ఏర్పాటు చేసిన ఈ హెలిపాడ్‌ వద్దే దిగారు. ఆ హెలికాప్టర్‌ నడిపిన పైలట్‌.. ఇప్పుడు హెలికాప్టర్‌ను నడిపిన పైలట్‌ ఒకరే కావొచ్చని.. అందుకే యాదగిరిగుట్టలో ల్యాండింగ్‌ అనగానే పెద్దగుట్ట వద్ద హెలిపాడ్‌ను సూచిస్తూ ఏర్పాటు చేసే విండ్‌ ఫ్లాగ్‌ లేనప్పటికీ నేరుగా దించాడని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఉదంతంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. అలాగే ఆర్‌ అండ్‌ బీ ఈఈకి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.  

ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులు ఇవీ.. 
రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో పెద్దగుట్ట (టెంపుల్‌ సిటీ)లో 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల నిర్మాణం. అక్కడే యాగశాలలతోపాటు ఒక గోశాల ఏర్పాటు. 
యాదగిరికొండపై రూ. 43.12 కోట్లతో డారి్మటరీ, దీక్షాపరుల సదనం నిర్మాణం. 

కొండపై గతంలో బాలాలయం ఉన్న చోట స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో కల్యాణ మండపం. 
భక్తుల కోసం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ.1.41 కోట్లతో రక్షణ పైకప్పు నిర్మాణం. 
 రథశాల వైపు ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement