నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌.. సర్పంచ్‌ ఇంట్లో భోజనం

Telangana CM KCR Visit Vasalamarri On August 4 - Sakshi

ముందుగా దళితవాడలో పర్యటన

దళిత బంధుపై స్థానికులతో చర్చ

సర్పంచ్‌ ఇంట్లో మధ్యాహ్నభోజనం

గ్రామాభివృద్ధి కమిటీతో సమావేశం

సాక్షి, యాదాద్రి:  ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రానున్నారు. జూన్‌ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి, గ్రామస్తులతో కలసి సీఎం సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి మరో అంకాపూర్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన సంగతీ విదితమే. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌ నుంచి కేసీఆర్‌ వాసాలమర్రికి చేరుకుంటారు. 53 దళిత కుటుంబాలతో కూడిన కాలనీలో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుంటారు. దళిత బంధుపై చర్చిస్తారు.  

సర్పంచ్‌కు సీఎం ఫోన్‌ 
గ్రామ సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేస్తారు. వాస్తవానికి జూన్‌ 22నే సర్పంచ్‌ ఇంటికి వస్తానని చెప్పినప్పటికీ ఆరోజు సమయాభావం వల్ల వెళ్లలేకపోయారు. మరోమారు వస్తానని ఆ రోజు సర్పంచ్‌కు హామీ ఇచ్చిన సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు సర్పంచ్‌కు స్వయంగా ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత గ్రామంలోని రైతువేదిక భవనంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి పరిమిత సంఖ్యలో 150 మంది మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.  

గ్రామాభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చ 
జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. జూన్‌ 22 తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఏ ర్పాటు, యువత, రైతులు, మహిళల అభ్యున్నతికి అవసరమైన చర్యలు, గ్రామంలో మౌలిక వసతులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, సాగు, తాగు నీటి వివరాలు, ఉపాధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top