సమాన న్యాయంతోనే సార్థకత

Telangana: CJI NV Ramana Highlights Need For Lawyers At Grassroot Level - Sakshi

న్యాయవాదులకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపు 

ఘనంగా నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవం  

సాక్షి, మేడ్చల్‌ జిల్లా/శామీర్‌పేట్‌: న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని, యువత తమ శక్తిని పూర్తిగా వినియోగించుకున్నపుడే మెరుగైన భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పారు.

ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, భాష ఏదైనా సమాచార సేకరణ సమర్థవంతగా ఉండాలన్నారు. న్యాయ విద్యా ర్థులు ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ముందుగా విచారణ అనుభవాన్ని పొందాలని సూచించారు.

విశ్వవిద్యాలయాల కంటే ప్రజలతో ప్రత్యక్షంగా నేర్చుకున్న పాఠాలే మేధోసంపత్తి ఎదుగుదలకు దోహదపడతాయని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. అంతకుముందు వర్సిటీలో విద్యార్థుల హాస్టళ్ల భవనాలతోపాటు డైనింగ్‌ హాలును హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, నల్సార్‌ చాన్స్‌లర్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు.  

గోల్డ్‌ మెడల్స్‌ అందజేత 
2020, 2021 సంవత్సరాల్లో గోల్డ్‌మెడల్స్‌ సాధించిన 104 మంది విద్యార్థులకు జస్టిస్‌ రమణ గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు. అలాగే వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పట్టాలను అందజేసి అభినందించారు. అనంతరం నల్సార్‌ వర్సిటీ రూపొందించిన పలు రివ్యూ డాక్యుమెంటరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఎస్‌ఎం ఖాద్రీ, జస్టిస్‌ పి.వెంకటరమణా రెడ్డి, కార్మిక మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top