సివిల్‌ సప్లైస్‌ గోదాములపై సోలార్‌ పలకలు 

Telangana: Civil Supplies Corporation To Install Solar Panels In Warehouses - Sakshi

24 చోట్ల ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కూడా..

రెడ్కో సహకారంతో గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు

రైస్‌మిల్లుల్లోనూ సౌర విద్యుత్‌ వ్యవస్థలు నెలకొల్పాలని నిర్ణయం

పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నెలవారీ విద్యుత్‌ బిల్లుల భారం నుంచి బయటపడటం, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందడం కోసం పౌర సరఫరాల శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ గోదా ములపై సోలార్‌ పలకలను అమర్చి.. విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలని, ఇదే సమయంలో పలుచోట్ల ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుద్ధర ణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో కలసి సివిల్‌ సప్లైస్‌ పరిధిలోని గోదా­ములతోపాటు పెట్రోల్, ఎల్పీజీ ఔట్‌లెట్లలోనూ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

శుక్రవారం పౌర సరఫరాల భవనంలో రెడ్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానయ్య, తెలంగాణ సోలార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ కుమార్‌ గౌడ్, ఇతర అధికారులతో రవీందర్‌సింగ్‌ సమావేశమై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన కరెంటు చార్జీలను తగ్గించుకు నేందుకు గోదాముల్లో సోలార్‌ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్టు రవీందర్‌సింగ్‌ వెల్లడించారు.

తొలిదశలో సంస్థకు చెందిన 19 గోదాములు, రెండు పెట్రోల్‌ బంకులు, ఐదు ఎల్పీజీ గోదాములు కలిపి మొత్తం 26 చోట్ల ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపా దనలపై చర్చించామన్నారు. అందులో 24 చోట్ల అనుకూలంగా ఉన్న ట్టుగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఇక తమ పరిధిలోని రైస్‌మిల్లుల్లోనూ సౌర విద్యుత్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు.

సమావేశం అనంతరం రవీందర్‌సింగ్‌ సికింద్రాబాద్‌లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో సోలార్‌ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయంపై సోలార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ కుమార్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top