Telangana Budget 2022: ఆ మూడింటిపైనే కేసీఆర్‌ సర్కార్‌ ఫోకస్‌

Telangana: Budget 2022 Special Focus On Rythu Bandhu Education Agriculture - Sakshi

ఈ నెల 13 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలు.. 

నెలాఖరులోనే అసెంబ్లీ ముందుకు! 

ఈసారి రూ.2.50 లక్షల కోట్ల వరకు ప్రతిపాదనలు ఉండే అవకాశం 

2022–23 బడ్జెట్‌ కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

దళితబంధు, వ్యవసాయం, విద్య–వైద్య మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దళిత సంక్షేమం, వ్యవసాయం, వైద్య, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఈసారి బడ్జెట్‌ ఉంటుందని సమాచారం. గత ఏడాది ప్రతిపాదించిన రూ.2.30 లక్షల కోట్ల అంచనాలతో పోలిస్తే.. ఈసారి బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2022–23 సంవత్సరానికి అవసరమయ్యే నిధుల కోసం శాఖల వారీగా అంచనాల ప్రతిపాదనలు గత నెలాఖరులోనే ఆర్థిక శాఖకు చేరాయి.

వీటితోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరణల బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా అన్ని శాఖల నుంచి అందాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వీటన్నింటినీ సమీక్షించి.. ఆచితూచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముచ్చింతల్‌ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో బడ్జెట్‌ సమీక్ష సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసీఆర్‌ సూచనల మేరకు బడ్జెట్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను ఏటా మార్చి నెలలో అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా.. ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి బడ్జెట్‌ ప్రవేశపెట్టే యోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సొంత పన్ను ఆదాయం పెరగడంతో.. 
ఈసారి బడ్జెట్‌ గణాంకాలపై రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం గణనీయ ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందటి రెండేళ్లతో పోలిస్తే 2021–22లో సొంత పన్నుల ఆదా యం భారీగా పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో డిసెంబర్‌నాటికి నాలుగు ప్రధాన పన్ను ఆదాయాలు రూ.48 వేల కోట్లమేర రాగా.. కరోనాతో ప్రభావితమైన 2020–21లో రూ.44 వేల కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నాటికి రూ.65వేల కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెండుసార్లు భూముల ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ పెంపు, ఎక్సైజ్‌ విధానంలో మార్పులు, జీఎస్టీ, అమ్మకపు పన్ను వసూళ్లలో పకడ్బందీగా ముందుకెళ్లడంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే.. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం కంటే.. 10 శాతం ఎక్కువగా బడ్జెట్‌ ప్రతిపాదనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 

ఈ మూడూ కీలకం! 
ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో మూడు అంశాలపై ప్రధానంగా ఫోకస్‌ చేయనున్నట్టు తెలిసింది. గత ఏడాదిలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితులను బట్టి దళితబంధు, వ్యవసాయం–రైతులు, విద్య–వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. సాగునీటి బడ్జెట్‌కు గత బడ్జెట్‌ తరహాలోనే కేటాయింపులు ఉంటాయని, పాలమూరు లిఫ్టుతోపాటు కృష్ణా బేసిన్‌లో పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా, వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి సంక్షేమ పథకాలకు యథాతథంగా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నాయి. 

దళిత బంధుకు రూ.20 వేలకోట్లు! 
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి ఈసారి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో దళిత సాధికారత పేరుతో రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ ఈ క్రమంలోనే ప్రభుత్వ ‘దళిత బంధు’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్రంలోని 15–16 లక్షల కుటుంబాలకు సాయం అందించాలని, ఇందుకోసం దశలవారీగా ప్రతిపాదనలు చేయాలని సీఎం కేసీఆర్‌ గతంలోనే సూచించారు. వచ్చే బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. దీంతో బడ్జెట్‌లో దళితబంధుకు పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 

రైతుల కోసం మరో కొత్త పథకం? 
బడ్జెట్‌లో ప్రాధాన్యాల్లో మరో కీలక అంశంగా వ్యవసాయం–రైతుల అంశాలను తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. అందులో రూ.14,800 కోట్లు రైతుబంధుకు, రూ.5వేల కోట్లకుపైగా రుణమాఫీ కోసం, రూ.1,200 కోట్ల వరకు రైతు బీమా కోసం ప్రతిపాదించారు. వీటిని కొనసాగిస్తూనే.. ఈసారి రైతుల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 

వైద్యం–విద్యకు పెద్దపీట 
ఈసారి బడ్జెట్‌లో వైద్య, విద్యా రంగాలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా వంటి ఆరోగ్య విపత్తులు ఎప్పుడు వచ్చినా తట్టుకునేందుకు వీలుగా వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆస్పత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ప్రత్యేక సౌకర్యాల కల్పన, ఇతర చర్యల కోసం వైద్యారోగ్య శాఖకు గతేడాది కంటే రూ.10 వేల కోట్ల మేర అధికంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఇక విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, డిజిటల్‌ క్లాస్‌రూంల ఏర్పాటుపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిందని చెప్తున్నాయి. ఈ క్రమంలో ప్రాథమిక విద్యకు రూ.13వేల కోట్ల వరకు కేటాయిస్తారని సమాచారం. 
 
 
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top