Omicron-Booster Dose: ఒమిక్రాన్‌ దడ, థర్డ్‌వేవ్‌ హెచ్చరిక.. ‘బూస్టర్‌’ వైపు పరుగులు..

Telangana: Amid Omicron Scare People Queue Up For Booster Dose - Sakshi

రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌పై పెరుగుతున్న ఆసక్తి

ముందుకొస్తున్న వృద్ధులు, వ్యాధులున్న వాళ్లు

వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే కొందరికి బూస్టర్‌

పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ అనధికారికంగా స్టార్ట్‌

హైదరాబాద్‌కు చెందిన నారాయణకు 60 ఏళ్లు. దీర్ఘకాలిక సమస్యలున్నాయి. రెండో డోస్‌ పూర్తయి 6 నెలలైంది. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నారు. 

డాక్టర్‌ సూర్యనారాయణరావు (పేరు మార్చాం). 52 ఏళ్లు. కరోనా రెండో వేవ్‌  సమయంలో ఈయన గుండెకు స్టెంట్లు వేశారు. షుగర్‌ కూడా ఉంది. పైగా కరోనా రెండో డోస్‌ వేసుకొని ఆరు నెలలైంది. ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని మూడో డోస్‌ వేయించుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ దడ, థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో రాష్ట్రంలో అనేకమంది కరోనా బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా మూడో డోస్‌ వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు పైబడినవారు బూస్టర్‌ వేయించుకుంటున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నట్లు ఆయనే స్వయంగా అంతర్గతంగా వెల్లడించడం గమనార్హం. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ పలువురు బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటున్నారు. ఇదంతా అనధికారికంగా జరుగుతుండటంతో ఎంతమంది వేయించుకున్నారో స్పష్టత లేదు. మరోవైపు అవసరమైన వారికి బూస్టర్‌ డోస్‌ వేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవలే కేంద్రానికి విన్నవించిన విషయం తెలిసిందే.  
చదవండి: ఒమిక్రాన్‌ అప్‌డేట్స్‌.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. 

రెండో డోసులేసుకున్న ఆర్నెల్ల తర్వాత.. 
రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్‌ భయంతో టీకాలు వేయించుకోవడానికి అనేకమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే 97.35 శాతం మంది మొదటి డోస్‌.. 56.08 శాతం మంది రెండో డోస్‌ వేయించుకున్నారు. 11 జిల్లాల్లో నూరు శాతం ఫస్ట్‌ డోస్‌ పూర్తయింది. సహజంగా రెండు డోసులు వేసుకున్న ఆరు నెలల వరకే కరోనా నుంచి రక్షణ ఉంటుంది. ఆ తర్వాత బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటే మంచిదన్న భావన ఉంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లకు బూస్టర్‌ వేయాలన్న చర్చ నేపథ్యంలో ఈ వర్గం ప్రజలు చాలా చోట్ల మూడో డోస్‌ వేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు మూడో డోస్‌ వేయాలని వాదనలు నడుస్తున్నాయి. 
చదవండి: హైదరాబాద్‌: ఆరుగురు పరారు.. నలుగురు దొరికారు

తొలి, రెండో డోస్‌పైనే కేంద్రం దృష్టి 
కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బూస్టర్‌ డోస్‌ వేయించుకునే వారి నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నట్లు కొందరు తెలిపారు. అధికారికంగా వేయడానికి అనుమతి లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ లేకుండానే వేస్తున్నారు. కేంద్రం ప్రస్తుతం మొదటి, రెండో డోస్‌పైనే దృష్టి పెట్టింది. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉండటంతో బూస్టర్‌ వేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కేంద్రమూ బూస్టర్‌పై నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
చదవండి: క్రికెట్‌ టోర్నీలో చాన్స్‌ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top