వాతావరణంలోని గాలితో..! నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌..!

Tejas Aircraft Tech Comes In Aid Of Oxygen Starved Indian Cities - Sakshi

‘తేజస్‌’ సాంకేతికతతో ఏర్పాటయ్యే ఆక్సిజన్‌ కేంద్రాల సామర్థ్యమిది...

దేశవ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన డీఆర్‌డీవో

నేరుగా రోగులకు సరఫరా.. సిలిండర్లలో నింపుకొనే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కారణంగా దేశంలో ఏర్పడ్డ ఆక్సిజన్‌ కొరత నివారణకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నడుం బిగించింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అక్కడికక్కడే ఆక్సిజన్‌ తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించి.. దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పాటయ్యే కేంద్రాలు ఒక్కొక్కటీ నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కో కేంద్రంతో 190 మందికి ఆక్సిజన్‌ అందించవచ్చని.. అదనంగా 195 సిలిండర్లను నింపవచ్చని డీఆర్‌డీవో బుధవారం ఓ ప్రకటన వెల్లడించింది. బెంగళూరులోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్, కోయంబత్తూరుకు చెందిన ట్రైడెంట్‌ న్యూమాటిక్స్‌లకు ఇప్పటికే టెక్నాలజీని బదలాయించామని.. ఆ రెండు సంస్థలు 380 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసి డీఆర్‌డీవోకు అందిస్తాయని తెలిపింది. సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం మరో 120 ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేస్తుందని వివరించింది.

పీఎస్‌ఏ టెక్నాలజీతోనే..
డీఆర్‌డీవో తయారు చేస్తున్న మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు అన్నీ ‘ప్రెషర్‌ స్వింగ్‌ అబ్జార్‌ప్షన్‌ (పీఎస్‌ఏ)’టెక్నాలజీతో పనిచేస్తాయి. వాతావరణం నుంచి గాలిని పీల్చుకుని.. జియోలైట్‌ పదార్థం సాయంతో అందులోని ఇతర వాయువులను తొలగించి 933% గాఢతతో ఆక్సిజన్‌ను వేరు చేస్తారు. దీన్ని నేరుగా కోవిడ్‌ రోగులకు అందించవచ్చు. అవసరమైతే సిలిండర్లలో నింపుకోవచ్చు. ఆస్పత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఖర్చులు కలిసివస్తాయని.. సుదూర, ఎత్తైన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు ఎంతో ఉపయోగపడుతుందని డీఆర్‌డీవో పేర్కొంది. పీఎం కేర్స్‌ నిధుల ద్వారా నెలకు 120 చొప్పున ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేస్తామని వెల్లడించింది. డీఆర్‌డీవో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top