హైదరాబాద్‌లో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి.. కేసీఆర్‌కు తమ్మినేని హితవు

Tammineni Veerabhadram Suggests CM KCR To Protest In Delhi - Sakshi

నల్లగొండ టౌన్‌: కేసీఆర్‌ హైదరాబాద్‌లో ధర్నా చేయడం కాదని, చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలు పుకొని ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలను అడ్డుకోవడం కోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా కలసి పోరాడటానికి సిద్ధమని స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో సీపీఎం జిల్లా మహాసభలను ప్రారంభించారు.

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్‌ పాలన సాగట్లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే అనుకూల పాలన సాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలిస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి రాష్ట్రమంతా పచ్చగా ఉందని చెబుతున్నారని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ దొంగ నాటకాలు ఆడుతున్నాయని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్టం పేరుతో దేశంలోని హిందువుల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోం దని తమ్మినేని విమర్శించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top