breaking news
protest in Delhi
-
హైదరాబాద్‌లో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి.. కేసీఆర్‌కు తమ్మినేని హితవు
నల్లగొండ టౌన్: కేసీఆర్ హైదరాబాద్‌లో ధర్నా చేయడం కాదని, చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలు పుకొని ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలను అడ్డుకోవడం కోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా కలసి పోరాడటానికి సిద్ధమని స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో సీపీఎం జిల్లా మహాసభలను ప్రారంభించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ పాలన సాగట్లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే అనుకూల పాలన సాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలిస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి రాష్ట్రమంతా పచ్చగా ఉందని చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్టం పేరుతో దేశంలోని హిందువుల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోం దని తమ్మినేని విమర్శించారు. -
ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలో నిరసన గళం
► ఎన్‌కౌంటర్‌ను ఖండించిన సీపీఐ నేత డి.రాజా ► ఇది భారీ బూటకపు ఎన్కౌంటర్: ప్రొఫెసర్ సాయిబాబా సాక్షి, న్యూఢిల్లీ: ఏవోబి లోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఖండిస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు,మేధావులు, విద్యార్ధి సంఘాలు సంయుక్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ నేత డి.రాజా మాట్లాడుతూ భూమి కోసం,హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై దాడిని తీవ్రంగా ఖండించారు. దీన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకపై జరిగిన దాడిగా రాజా పేర్కొన్నారు. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మీడియాలో వచ్చిన విషయాలను ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.ఎన్ సాయిబాబా వివరించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చిన సాక్ష్యాలను బట్టి ముందుగా వేసుకున్న పధకం ప్రకారమే ఈ ఆపరేషన్ చేపట్టారని, దేశ చరిత్రలోనే ఇది భారీ బూటకపు ఎన్కౌంటర్ అని,పట్టుకొని కాల్చి చంపారని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ కోసం జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారని సాయిబాబా చెప్పారు. పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టులను తక్షణం కోర్టులో హాజరు పర్చాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమొక్రసీ నేత అపర్ణ డిమాండ్ చేశారు. మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, గాలింపు చర్యల పేరిట ఆదివాసీ గ్రామాలను ధ్వంసం చేయరాదని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఏబిఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, బిఏఎస్‌వో, బస్తర్ సాలిడారిటీ నెట్వర్క్, సిఎఫ్ఐ,సిపిఐ(ఎం-ఎల్) లిబరేషన్,పియుసిఎల్, పియుడిఆర్ తదితర సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.