
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఉత్పత్తులు, పరిష్కారాల కోసం విద్యార్థులు, తయారీదారుల విశిష్ట భాగస్వామ్యంతో టీ వర్క్స్ ‘మేక్ ఏ థాన్’ను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 300 మంది తమ ఆలోచనలను పంచుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమకు వచ్చిన ఆలోచనలతోపాటు ఆవిష్కరణలను టీ వర్క్స్‌కు సమర్పించారు. వీటికి టీ వర్క్స్ సాయంతో పలువురు ఔత్సాహికులు ప్రోటో టైప్ రూపొందించారు.
తనంతట తానుగా శుభ్రపరుచుకునే డోర్ హ్యాండిల్, దూరం నుంచే కౌగిలించుకునేలా సూచించే సాధనం, ఇతరులు అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు బీప్ శబ్దం చేసే స్మార్ట్ వాచ్ తదితరాలు ఈ ఆవిష్కరణల జాబితాలో ఉన్నాయి. వీటిని శనివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య వర్చువల్ విధానంలో ప్రదర్శించేందుకు టీ వర్క్స్ సన్నాహాలు చేస్తోంది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, టీవర్క్స్ సీఈఓ సుజయ్ కారంపురి వర్చువల్ ప్రదర్శనలో పాల్గొంటారు.