Disha Encounter Case Verdict: తుది దశకు ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు 

Supreme Court Hear Report On Disha Case Encounter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. సుప్రీంకోర్టులోని ఫస్ట్‌ కోర్టులో శుక్రవారం తుది వాదనలు జరగనున్నాయి. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్, బాంబే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రేఖా పీ సొందర్‌ బాల్దోటా, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) మాజీ చీఫ్‌ డాక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ ‘దిశ’ కేసు విచారణాంశాలను క్రోడీకరించి రిపోర్టు కాపీలను సీల్డ్‌ కవర్‌లో పెట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టుకు సమర్పించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ లావు నాగేశ్వర రావులు కమిటీ నివేదిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అనంతరం శుక్రవారం తుది వాదనలు, ఆపైన తీర్పు వెలువరించనున్నారు. పోలీసులు, పిటిషనర్‌ తరుఫు న్యాయవాదులతో పాటు ‘దిశ’ నిందితుల కుటుంబ సభ్యుల తరుఫు న్యాయవాది, ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ పీవీ కృష్ణమాచారి సుప్రీంకోర్ట్‌ వాదనలకు హాజరుకానున్నట్లు తెలిసింది. 

ఎప్పుడు ఏం జరిగిందంటే? 
► 2019 నవంబర్‌ 27న రాత్రి చటాన్‌పల్లిలో ‘దిశ’ హత్యాచారం సంఘటన జరిగింది. డిసెంబర్‌ 6న సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసుల ఎదురు కాల్పులలో నలుగురు నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, సీహెచ్‌ చెన్నకేశవులు మృతి చెందారు. అదే ఏడాది డిసెంబర్‌ 12న సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. 

►‘దిశ’, నిందితుల కుటుంబ సభ్యులతో పాటూ పోలీసులు, వైద్యులు, విచారణాధికారులు (ఐఓ), రాష్ట్రం నియమించిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) 53 మంది అధికారులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కమిషన్‌ విచారించింది.

►నలుగురు మృతుల పోస్ట్‌మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్‌ రికార్డులు, ఫొటోగ్రాఫ్‌లు,  వీడియోల ఆధారంగా సుమారు 47 రోజుల పాటూ సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసి, వాంగ్మూలాలను సేకరించింది.

►ఆ తర్వాత త్రిసభ్య కమిటీ చటాన్‌పల్లిలోని దిశ సంఘటనా స్థలాన్ని, షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను భౌతికంగా సందర్శించి పలు కీలక సాక్ష్యాలు, ఫొటోలు, వీడియాలను సమీకరించింది. తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.   
చదవండి: రాజ్యసభకు ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top