బాబోయ్‌ ఎండలు.. సాయంత్రం కాగానే అక్కడ క్యూ కడుతున్న జనం

Summer Season People Relax Mood Evening At Park Hyderabad - Sakshi

ఉదయం వేసవితాపం సాయంత్రం కాగానే పార్కులకు జనం క్యూ..

సహజ సిద్ధమైన గాలి ఆహ్లాదకర వాతావరణం

ముచ్చట్లతో సీనియర్‌ సిటిజన్స్‌ ఆటలతో చిన్నారుల బిజీ

సాక్షి,సైదాబాద్‌(హైదరాబాద్‌): భానుడి భగభగలతో ఉదయమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిన్నారులు, పెద్దలు సాయంత్రం వేళల్లో మాత్రం కాలనీల్లోని ఉద్యానవనాల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఉదయమంతా ఏసీలు, కూలర్ల నుంచి కృత్రిమ చల్లదనంతో ఉపశమనం పొందుతూ సాయంత్రం కాగానే ప్రకృతి సహజంగా వచ్చే చల్లదనం కోసం పార్కులకు చేరుకుంటున్నారు. 

ఆటపాటలతో చిన్నారుల సందడి... 
► ఐఎస్‌సదన్‌ డివిజన్‌లోని పలు పార్కుల్లో సాయంత్రం వేళల్లో చిన్నారులు సందడిగా గడుపుతున్నారు.   
► ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో చదువులకు తాత్కాలికంగా విరామం రావడంతో చిన్నారులు ఆట పాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.   
► సరస్వతీనగర్‌ కాలనీలోని పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట పరికరాల వద్ద చిన్నారులు ఉత్సాహంగా ఆడుకుంటున్నారు.  
► తమ పిల్లలు  పార్కుల్లో ఉరుకులు, పరుగులు పెడుతూ ఆటలాడుకోవటం వారి తల్లిదండ్రులకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  
► కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ వంటి వాటితో రోజంతా గడుపుతున్న తమ చిన్నారులు సాయంత్రం ఇలా ఆడుకోవడం వల్ల శారీరక దృఢత్వాన్ని పొందుతారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.  

ముచ్చట్లతో సేద తీరుతున్న పెద్దలు... 
►భానుడి ప్రతాపం తగ్గి సాయంత్రం చల్లబడుతుండగానే సీనియర్‌ సిటిజన్లు తమ కాలనీల్లోని పార్కులకు చేరుకుంటున్నారు. పార్కుల్లోని వాకింగ్‌ ట్రాక్‌పై కొద్ది సేపు నడుస్తున్నారు. ► తర్వాత పార్కుల్లోని సిమెంట్‌ బెంచీలపై కూర్చొని ముచ్చటించుకుంటున్నారు.  
► సరస్వతీనగర్‌ కాలనీ పార్క్‌కు సాయంత్రం కాగానే వయో వృద్ధులు చేరుకుంటున్నారు. వాకింగ్‌ చేశాక అందరూ ఒకచోటికి చేరుతున్నారు. ప్రకృతి సహజంగా వస్తున్న చల్లటి గాలిలో సేద తీరుతూ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.  

అన్ని పార్కుల్లో పచ్చదనం పెంచాలి... 
► డివిజన్‌ పరిధిలోని కొన్ని కాలనీలలోని పార్కులు పూర్తిగా ఆధునీరించబడగా, మరికొన్ని పార్కులు పచ్చదనానికి నోచుకోవటం లేదు.  
► దాంతో తమ ప్రాంతంలో పార్కు సరిగా లేక ఆ ప్రాంతం వారు పక్క కాలనీలోని పార్కులకు వెళ్తున్నారు. దీంతో పార్కుల్లో సాయంత్రం వేళ రద్దీ ఎక్కువ అవుతోంది.  కొన్ని కాలనీల వారు ఇతర ప్రాంతాల వారు తమ కాలనీలకు రావద్దని వారిస్తున్నారు.  
► డివిజన్‌లోని అన్ని పార్కుల్లో పచ్చదనం, వాకింగ్‌ ట్రాక్, చిన్నారులకు ఆట పరికరాలు, వసతులు కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని పలు కాలనీలవాసులు అభిప్రాయపడుతున్నారు. 

ఉల్లాసంగా గడుపుతున్నాం 
ఉదయం పూట భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడుతున్న మేము సాయంత్రం కాగానే పార్కులకు వెళ్లి ఉల్లాసంగా గడుపుతున్నాం. సరస్వతీనగర్‌ కాలనీ పార్కులో పచ్చదనం చెదిరిపోకుండా కాలనీవాసులంతా కలిసి పరిరక్షించుకుంటున్నాం. పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పరికరాలను మరితం నాణ్యమైనవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 
– గున్న మహేందర్‌రెడ్డి, సరస్వతీనగర్‌ కాలనీ 

చిన్నారులను చూస్తే ముచ్చటేస్తోంది 
ఎండకాలంలో ఉపశమనానికి ఇళ్లలో ఎన్ని పరికరాలు ఉన్నా పార్కుల్లో ప్రకృతి సిద్ధమైన చల్లదనం చాలా బాగుంటుంది. కొద్దిసేపు వ్యాయామం చేసి మరికొద్ది సేపు సహచరులతో మాట్లాడితే సాయంత్రం సమయం వేగంగా గడిచిపోతోంది. పార్కుల్లో చిన్నారులంతా చేరి ఆటలతో సందడిగా గడపడం చూస్తే ముచ్చటేస్తోంది. ఇతర కాలనీల్లోని పార్కులను కూడా ఆధునీకరిస్తే అక్కడ వారికీ ఉపయోగకరంగా ఉంటుంది. 
 – గోపాల్‌రెడ్డి, సరస్వతీనగర్‌ కాలనీ 

చదవండి: Hyderabad: వర్ష సూచన.. ఆ సమయంలో ఇళ్లలోంచి బయటకు రాకండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top