Hyderabad: రూ.8 లక్షలిస్తేనే ఎస్‌ఐ పోస్టింగ్‌ | Sub-Inspector Postings Under Scrutiny Over Alleged Bribery And Transfer Irregularities In A High-Demand Zone | Sakshi
Sakshi News home page

Hyderabad: రూ.8 లక్షలిస్తేనే ఎస్‌ఐ పోస్టింగ్‌

May 21 2026 7:50 AM | Updated on May 21 2026 9:34 AM

Sub-Inspector Posting 8 lakhs In Police Commissionerate

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లోని ఓ ఖరీదైన పోలీసు కమిషనరేట్‌ పరిధి ఠాణాలో ఎస్‌ఐ పోస్టింగ్‌ కావాలంటే రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే. ఓ జోన్‌ ఉన్నతాధికారి ఈ రేటు నిర్ణయించి పలువురు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ), సబ్‌ ఇన్స్‌పెక్టర్లు (ఎస్‌ఐ)లతో కలిసి డీల్స్‌ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కమిషనరేట్‌ నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ఇన్స్‌పెక్టర్ల బదిలీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 

తాజాగా ఇదే కమిషనరేట్‌లో  ప్రతి ఠాణా నుంచి ఇద్దరు ముగ్గురు ఎస్‌ఐలు ఇతర జోన్‌కు బదిలీ అయ్యారు. ఈ బదిలీల వెనుక ముడుపుల వ్యవహారం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇంటెలిజెన్స్‌ విభాగం అంతర్గత విచారణ చేపట్టి ముడుపుల వ్యవహారం నిజమేనని తేల్చింది. ఆయా పోలీసు అధికారుల లావాదేవీలు, ఇతరత్రా అంశాలను నిర్ధారించేందుకు ముడుపుల నివేదికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించినట్లు విశ్వసనీయ సమాచారం. 

ఫుల్‌ డిమాండ్‌.. 
ఈ ఖరీదైన జోన్‌లోని ఠాణా పోస్టులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ పోస్టింగ్‌ వస్తే లైఫ్‌ సెటిల్‌ అయిపోతుందనే భావన పలువురు పోలీసుల్లో ఏర్పడింది. దీంతో ఈ జోన్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోస్టింగ్‌ల కోసం నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈక్రమంలో ఓ డివిజన్‌లోని రెండు ఠాణాల ఎస్‌హెచ్‌ఓలు, మరో డివిజన్‌లోని ఒక ఎస్‌ఐ ఖరీదైన జోన్‌ ఉన్నతాధికారితో జట్టు కట్టారు. బదిలీ అయిన వారి స్థానంలో పోస్టుల కావాలనుకునే వారితో డీల్‌ కుదుర్చుకున్నారు. అయితే సదరు ఎస్‌ఐలు బదిలీ అయ్యారు గానీ వీరి స్థానంలో కొత్త వారికి పోస్టింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఈ కమిషనరేట్‌లోని అన్ని ఠాణాలలో ఎస్‌ఐల కొరత ఏర్పడింది. సెక్టార్‌ ఎస్‌ఐలు లేకపోవడంతో నేరస్తుల కదలికలపై నిఘా కొరవడడంతో పాటు కేసుల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement