మెట్రో రెండోదశకు లైన్‌ క్లియర్‌ | state takes over metro phase 1 clears way for phase 2 | Sakshi
Sakshi News home page

మెట్రో రెండోదశకు లైన్‌ క్లియర్‌

May 1 2026 8:27 AM | Updated on May 1 2026 8:27 AM

state takes over metro phase 1 clears way for phase 2

సాక్షి, హైదరాబాద్‌: మెట్రోరైల్‌ మొదటిదశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండోదశ విస్తరణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఏడాది క్రితమే రెండోదశ కోసం ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సాంకేతిక చిక్కుముళ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతిని నిరాకరించింది. మొదటిదశ ప్రాజెక్టు ఎల్‌అండ్‌ టీ సంస్థ నిర్వహణలో ఉండగా, రెండోదశను ప్రభుత్వం నిరి్మస్తే మొదటి, రెండోదశ రైళ్ల నిర్వహణల మధ్య సమన్వయం కొరవడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం..ఎల్‌అండ్‌ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను టేకోవర్‌ చేసింది. దీంతో రెండో దశకు కేంద్రం నుంచి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు.

దశలవారీగా విస్తరణ..
రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మొదటి దశలో నాగోల్‌ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు (36.8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్‌ నియోపోలిస్‌ వరకు(11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు (7.5 కి.మీ.), మియూపూర్‌–పటాన్‌చెరు(13.4 కి.మీ.), ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ. వరకు నిర్మించనున్నారు. ఆ తరువాత రెండోదశలో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు (39.6 కి.మీ.), జేబీఎస్‌–మేడ్చల్‌ వరకు (22 కి.మీ.), జేబీఎస్‌–శామీపేర్‌పేట్‌ వరకు(22 కి.మీ.) చొప్పున మరో 86.1 కి.మీ., నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు.

పాతబస్తీలో మొదటగా...  
మెట్రో రెండోదశకు వివిధ కారిడార్లలో భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాలపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఇప్పటికే దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదిత 7.5 కి.మీ. మార్గంలో రహదారుల విస్తరణతోపాటు ఆస్తుల సేకరణ చేపట్టింది. ప్రస్తుతం ఇది తుదిదశలో ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మొదట ఈ మార్గంలో నిర్మాణం చేపడతారు.


 

Advertisement
 
Advertisement
Advertisement