నిధులిచ్చినా.. పారడం లేదు! | State government indifference towards reservoir repairs | Sakshi
Sakshi News home page

నిధులిచ్చినా.. పారడం లేదు!

Apr 3 2026 4:23 AM | Updated on Apr 3 2026 4:23 AM

State government indifference towards reservoir repairs

జలాశయాల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత 

21 జలాశయాల్లో తీవ్ర లోపాలున్నట్లు తనిఖీల్లో వెల్లడి 

‘డ్రిప్‌’ కింద రూ. 545 కోట్లను కేటాయించిన కేంద్రం 

ఒక్క రూపాయీ ఖర్చు చేయని రాష్ట్రం.. కేంద్రం అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోక నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలోని కీలకమైన జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంలో ఉదాసీనత చూపుతోంది. ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ)ల ఆర్థిక సహాయంతో అమలు చేస్తున్న డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రాజెక్టు (డ్రిప్‌) రెండో దశ కింద రూ.100 కోట్లను రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం, మూడో దశ కింద రూ.445 కోట్లను సూత్రప్రాయంగా కేటాయించింది. 

రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులను డ్రిప్‌ పథకం కింద చేర్చి రూ.545 కోట్లతో మరమ్మతులు నిర్వహించడానికి 2024లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు రెండో దశ కింద 9 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను మాత్రమే కేంద్రానికి పంపించగా, కేంద్రం నుంచి రూ.5.72 కోట్లు విలువైన పనులకే ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఒక్క పనికీ టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్‌కు అప్పగించలేదు. ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. 

కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రిప్‌ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేసేందుకు నీటిపారుదల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇన్‌చార్జీ/అదనపు చార్జీ బాధ్యతల్లో పనిచేస్తున్న అధికారులు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని కేంద్ర జలశక్తి శాఖ తప్పుబట్టింది.  

రాష్ట్రం నుంచి 29 డ్యామ్‌లు
2025లో వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని జలాశయాలకు తనిఖీలు నిర్వహించగా, 21 జలాశయాల్లో తీవ్ర లోపాలు బయటపడ్డాయి. ఆనకట్టల భద్రత చట్టం, 2021 ప్రకారం ఈ జలాశయాలను కేటగిరీ–2 జాబితాలో చేర్చి అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. ఈ జలాశయాలకు డ్రిప్‌ కింద మరమ్మతులు నిర్వహించవచ్చని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి సూచన చేయడం గమనార్హం. 

డ్రిప్‌ ప్రాజెక్టు రెండు, మూడో దశల కింద దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల పరిధిలోని 736 డ్యామ్‌లను రూ.10,211 కోట్లతో పునరుద్ధరించడానికి కేంద్రం ఆమోదించింది. వీటిలో రాష్ట్రంలోని 29 డ్యామ్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్రం నుంచి నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, జూరాల, పాకాల లేక్, లక్నవరం, రామప్పలేక్, పాలేరు, డిండి, కోయిల్‌సాగర్, కడెం, మూసీ, శ్రీరామ్‌సాగర్, వట్టివాగు, స్వర్ణ, ఎల్‌ఎండీ, మల్లూరువాగు, బొగ్గులవాగు, ఎన్టీఆర్‌ సాగర్, కౌలాస్‌నాలా, సాత్నాలా, సింగూరు, గడ్డెన్నవాగు, అక్కంపల్లి రిజర్వా యర్‌ పెద్దదేవలపల్లి, పీపీఆర్‌ ప్రాజెక్టులున్నాయి. 

జూరాల ప్రాజెక్టును రూ.143.44 కోట్లు, నాగార్జునసాగర్‌ను రూ.29.56 కోట్లు, శ్రీరామ్‌సాగర్‌ను రూ.63.48 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించారు. వ్యయంలో 70శాతం రుణాన్ని కేంద్రం ఇప్పించనుండగా, 30 శాతం రాష్ట్ర వాటాగా భరించాల్సి ఉండనుంది. 2031 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని గడువు విధించింది.  

పొరుగు రాష్ట్రాలు భేష్‌
డ్రిప్‌ పథకాన్ని కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు బాగా సద్వినియోగం చేసుకున్నాయి. కర్ణాటకకు డ్రిప్‌ రెండో దశ కింద రూ.699 కోట్లు, మూడో దశ కింద రూ.400 కోట్లను కేటాయించగా, ఆ ప్రభుత్వం 13 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. అందులో రూ.600 కోట్లతో 11 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా, రూ.372 కోట్లు విలువైన పనులను కర్ణాటక ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఒడిశా సైతం రూ.40.59 కోట్లు విలువైన పనులు పూర్తి చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒక్క రూపాయీ ఖర్చుచేయలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement