
దోమలపెంట/నాగార్జునసాగర్: ఎగువ నుంచి భారీ వరద నీటి రాకతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్‌వే ద్వారా 2,02,739, విద్యుదుత్పత్తి చేస్తూ 29,555, సుంకేసుల నుంచి 4,479, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 2,37,023 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. దీంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద పది గేట్లను ఒక్కొక్కటి పది అడుగుల మేర పైకెత్తి.. స్పిల్‌వే ద్వారా 2,75,700 క్యూసెక్కులు, భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 65,626 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.9 అడుగుల వద్ద 209.5948 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్‌లో 26 గేట్ల ఎత్తివేత
ఎగువనుంచి నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరగడంతో.. 26 గేట్ల ద్వా రా స్పిల్‌వే మీదుగా 2,70,938 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,657 క్యూసెక్కులు మొత్తం 3,04,595 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుద ల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాల్వలకు 21,007 క్యూసె క్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 587.60 అడుగుల (305.8626 టీఎంసీలు) మేర నీరుంది.