శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద | Heavy flood hits Srisailam project | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద

Aug 24 2025 5:10 AM | Updated on Aug 24 2025 5:10 AM

Heavy flood hits Srisailam project

దోమలపెంట/నాగార్జునసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచి 53,313, హంద్రీ నుంచి 250 మొత్తం 4,70,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలంకు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఒక్కొక్కటి 18 అడుగుల మేర ఎత్తి.. స్పిల్‌వే ద్వారా 4,19,314 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 

మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,087.. మొత్తం 61,402 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.7 అడుగుల వద్ద 197.4617 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 2,818, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.480 మిలియన్‌ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.750 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 3,61,322 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,414 క్యూసెక్కులు మొత్తం 3,94,736 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement