
ఓటర్లు లేకున్నా...ఆయా కేటగిరీలకు రిజర్వేషన్
దీంతో అక్కడ ఎన్నిక జరిగే అవకాశమే లేదు..
మరికొన్ని చోట్ల ఒక్కరిద్దరే ఓటర్లు...వారి ఎన్నిక ఏకగ్రీవమే
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కారణంగా చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల పంచాయతీలు ఏకగ్రీవమమయ్యే పరిస్థితి ఉండగా, మరికొన్ని చోట్ల ఆయా పంచాయతీలకు రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులే దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా చేయగా, 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను ప్రాతిపదికన తీసుకొని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఆ 11 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల్లేరు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని జైత్రాంతండా, బాండావత్‌తండా, గోన్యతండా, బాలాజీనగర్‌తండా, మాన్‌తండా, నూనావత్‌తండాలో సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, అక్కడ బీసీ ఓటర్లే లేరు. అడవిదేవులపల్లి మండలంలోని చాంప్లాతండా బీసీ జనరల్‌కు రిజర్వు కాగా, అక్కడ ఒక్క బీసీ కూడా లేరు.
మాడుగులపల్లి మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో 881 మంది ఓట్లు ఉండగా, అందులో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు. అనుముల మండలం పేరూర్ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. అక్కడ 792 మంది ఓటర్లలో ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఓటరుగా ఉన్నాడు. తిరుమలగిరి(సాగర్)మండలంలో చింతలపాలెం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. అయితే అక్కడ ఎస్టీలు ఒక్కరూ లేరు. నేరేడుగొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయ్యింది. అక్కడ బీసీలే లేరు.
⇒ వరంగల్ జిల్లా సంగెం మండల పరిధిలోని ఆశాలపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. అక్కడ వంగరి మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమే. ఇదే మండల పరిధిలోని వంజరపల్లి పంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు.
⇒ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా, ఇక్కడ ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగర్ సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఈ గ్రామాల్లో ఎస్టీలే లేరు. గత ఎన్నికల్లో కూడా ఈ గ్రామసర్పంచ్ స్థానాలు ఎస్టీ రిజర్వ్‌డ్ కాగా.. ఆ వర్గానికి చెందిన వారు లేరు. అయితే వార్డు స్థానాలకు కూడా పోటీ చేయకుండా ప్రజలు బహిష్కరించడంతో ఎన్నికలు జరగలేదు.
చంద్రమ్మ కుటుంబానికే ‘చంద్రకల్’
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ ఎంపీటీసీ పరిధిలో చంద్రకల్, కుప్పగిరి గ్రామాలున్నాయి. ఈ ఎంపీటీసీ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఈ రెండు గ్రామాల పరిధిలో 4030 ఓటర్లు ఉన్నారు. అందులో చంద్రకల్ గ్రామానికి చెందిన, చంద్రమ్మ, ఆమె కొడుకు, కోడలు, కూతురు మాత్రమే ఎస్టీలు. దీంతో ఈ ఎంపీటీసీ పదవి ఆ కుటుంబానికే ఏకగ్రీవం కానుంది.
దంపతుల్లో ఒకరిని వరించనున్న సర్పంచ్ పదవి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ గ్రామంలో కాంపల్లి కోటమ్మ ఒక్కరే ఎస్సీ మహిళ. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. కూసుమంచి మండలం ధర్మాతండా జీపీ బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా అక్కడ కుమ్మరికుంట్ల నాగరాజు– శ్రావణి ఇద్దరే ఓటర్లు. వీరిది పక్కనున్న కేశ్వాపురం కాగా, ధర్మాతండాలో కోళ్ల ఫారం పెట్టుకుని ఓటు హక్కు పొందారు. మంగలి తండా బీసీ మహిళకు రిజర్వ్ కాగా తండా యువకుడు అనిత అనే బీసీ యువతిని వివాహం చేసుకోగా ఆమెకు ఓటు వచి్చంది. దీంతో అనిత ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. ఇదే మండలం లాల్ సింగ్ తండా బీసీ మహిళకు రిజర్వ్ కాగా అక్కడ ఒకే బీసీ కుటుంబం ఉండగా అత్తాకోడళ్లలో ఒకరికి సర్పంచ్ పదవి దక్కనుంది.
అజ్మీరా హీరామాన్ తండాలోనూ బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఒక్కటే బీసీ కుటుంబం ఉంది. అక్కడ ఏకగ్రీవం ఖాయం కానుంది. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీ ఎస్టీ మహళకు రిజర్వు అయ్యింది. అయితే ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. పెనుబల్లి మండలం గౌరారం పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వు అయ్యింది. ఇక్కడ ఇద్దరు ఓటర్లు ఉన్నారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. రఘునాథపాలెం మండలంలోని ఎన్.వీ.బంజర, రాములుతండాలో బీసీలే లేకున్నా ఎన్.వీ.బంజర బీసీ మహిళకు, రాములుతండా సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. కారేపల్లి మండలం కొత్తకమలాపురం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఇక్కడ వట్టం ఉమారాణి, సులోచన మాత్రమే పోటీకి అర్హులుగా తేలారు. గత ఎన్నికల్లో సర్పంచ్‌గా వట్టం ఉమారాణిని గెలిచింది. ఈసారి కూడా వీరిద్దరే పోటీ పడనున్నారు.
లాటరీలో ఒక రిజర్వేషన్.. గెజిట్‌లో మరో రిజర్వేషన్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ లాటరీ పద్ధతిలో జనరల్‌కు ఎంపికైంది. కానీ, జిల్లా కలెక్టర్ విడుదల చేసిన రిజర్వేషన్ గెజిట్‌లో మాత్రం జనరల్ మహిళగా నమోదు చేశారు. ఈ విషయం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్లగా, సరిదిద్ది మరో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచి్చనట్టు తెలిసింది.
అక్కడ ఆ ఓటర్లు లేక...
⇒ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లె పంచాయతీ ఎస్సీలకు రిజర్వు అయ్యింది. ఇక్కడ ఎస్సీ ఓటర్లే లేరు. కుభీర్ మండల పరిధిలోని ఫకీర్‌నాయక్‌తండా, దావూజీ నాయక్ తండాలో గిరిజనులే ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలు బీసీలకు రిజర్వు అయ్యాయి. పెంబి మండలం వేణునగర్‌లో కూడా ఎస్టీలే ఎక్కువ ఇది కూడా బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. 2019లో వేమనపల్లి మండలం రాజారం గ్రామం ఎస్సీ రిజర్వు కాగా, అక్కడ ఎస్సీలు ఎవరూ లేక ఎన్నిక జరగలేదు. తాజాగా ఎస్సీలకే కేటాయించారు. సారంగపూర్ మండలం హనుమాన్ తండా, పెండల్‌దరి గ్రామంలో బీసీ ఓటర్లు లేరు. ఈ గ్రామాలన్నీ బీసీలకు రిజర్వు అయ్యాయి.
⇒ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం తుమ్మలగూడలో ఎస్సీలే ఉండగా, ఈ గ్రామం బీసీ జనరల్ రిజర్వు అయ్యింది.
⇒ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గం, పీచర, ఆరేపల్లి గ్రామాలు బీసీలకు రిజర్వు కాగా, ఇక్కడ బీసీ ఓటర్లే లేరు.
⇒ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఏజెన్సీ గ్రామం. ఈ పంచాయతీ ఎస్టీలకు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. గిరిజన జనాభా లేక 40ఏళ్లుగా సర్పంచ్ ఎన్నిక జరగడం లేదు.
3 గ్రామాలకు ఎంపీపీ..
పట్టణీకరణతో పటాన్‌చెరు మండలంలోని కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలుగా, మరికొన్ని గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. దీంతో ఈ మండలంలో ప్రస్తుతం భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీలే మిగిలాయి. ఈ గ్రామాల నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక మండల పరిషత్ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. అయితే ఈ మూడు గ్రామ పంచాయతీలను కలిపి ఐదు ఎంపీటీసీ స్థానాలను చేసి ఎన్నికలకు వెళుతున్నారు.