కరీంనగర్ కార్పొరేషన్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీర్లు, బిర్యానీల పేరిట పోటీపడి రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు.. వాటికి బదులు మా కరీంనగర్‌లో రోడ్లు బాగు చేయొచ్చు.. గుంతలతో రోజూ నరకం చూస్తున్నాం.. తక్షణమే మరమ్మతు చేయండి. అని నగరానికి చెందిన సామాజిక కార్యకర్తలు దుంపేటి రాము, ఉమర్ అన్సారీ వినూత్న రీతిలో నిరసన తెలియచేశారు. సోమవారం నగరంలోని కేబుల్ బ్రిడ్జి జంక్షన్ ఎదుట రాజీవ్‌రహదారి బైపాస్ రోడ్డులోని గుంతల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
వారు మాట్లాడుతూ, నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మెయిన్‌రోడ్డు గుంతలుపడి అధ్వానంగా మారినా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. రాజీవ్ రహదారి, కేబుల్ బ్రిడ్జి రోడ్డు జంక్షన్‌లో గుంతలు నరకం చూపిస్తున్నాయన్నారు. తరచూ ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రూ.కోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ, కనీసావసరాలైన రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేబుల్ బ్రిడ్జి జంక్షన్ రోడ్డు మరమ్మతు చేయాలని వారు కోరారు.


