తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల రిమాండ్‌

Secunderabad Court 14 Days Remand For Teenmaar Mallanna Extortion Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యూ నూస్‌ చానెల్‌ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్‌ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. సికింద్రాబాద్‌ మధురానగర్‌ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్‌ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాగా శనివారం మల్లన్నను సికింద్రాబాద్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్‌ మల్లన్నపై ఐపీసీ సెక్షన్‌ 306,సెక్షన్‌ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్‌ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్‌ అటెంప్ట్‌ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అడిగింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్‌ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్‌ చంద్ర బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. 

ఇక మల్లన్న కేసు విషయానికి వస్తే.. సికింద్రాబాద్‌ మధురానగర్‌ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ తీన్మార్‌ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

చదవండి: తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!

ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌ రెడ్డికి సమన్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top