పాఠశాల బాధ్యత పంచాయతీలకు

School Sanitize Responsibility To Panchaties  Now Onward In Adilabad - Sakshi

సాక్షి, అదిలాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకు కట్టబెట్టనున్నారు. ప్రభుత్వ బడులను స్వచ్ఛ పాఠశాలలుగా మార్చే ఉద్దేశంతో ఇన్నాళ్లు ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తున్న బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో     ప్రకటించారు. 

పాఠశాలలు మెరుగుపడే అవకాశం..
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 455, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 102 ఉన్నాయి. వీటిల్లో 65వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలల్లో నూతన సిబ్బంది నియామకాలు లేకపోవడంతో స్వీపర్లు, పారిశుధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. బడుల ఆవరణలు పిచ్చిమొక్కలు, అపరిశుభ్రతతో నిండిపోతున్నాయి. కొన్ని పాఠశాల ఆవరణల్లో పశువులు సంచారం చేస్తున్నాయి. సిబ్బంది సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. జిల్లా విద్యా శాఖ తాత్కాలిక పద్ధతిలో కొంతమంది సిబ్బందిని నియమించినా.. తక్కువ వేతనాలు కావడంతో పని చేయడానికి వారు ఆ సక్తి చూపడం లేదు. కాగా పాఠశాలల పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో స మస్య తీరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు నిర్వహణ బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చూసేవారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే..
కరోనా తగ్గుముఖం పడితే మొదట ఉన్నత పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదట డిజిటల్‌ తరగతులు, ఆ తర్వాత ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు తెరవలేదు. బడులు తెరిచిన తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలల్లో నూతన విధానం అమలు చేసి పారిశుధ్య కార్యక్రమాలు ఆయా గ్రామ పంచాయతీల ద్వారా అధికారులు నిర్వహించనున్నారు.

ఆదేశాలు రావాల్సి ఉంది
పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. పూర్తిస్థాయి ఉత్తర్వులు రావాల్సి ఉంది. పాఠశాలలు తెరుచుకునే నాటికి వచ్చే అవకాశం ఉంది. – రవీందర్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top