తొలి పుష్కరస్నానం ఆచరించిన కంచి కామకోటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి
భూపాలపల్లి/ కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు శాస్త్రోక్తంగా విశేష పూజలతో ఆరంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు పుష్కరాలు లాంఛనంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రారంభించారు. ఇప్పటి వరకు సంప్రాదాయానికే పరిమితమైన సరస్వతి అంత్య పుష్కరాలు ఈసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదిలో గతేడాది ఆది పుష్కరాలు జరగ్గా, చివరి పన్నెండు రోజులు సరస్వతీ నది అంత్య పుష్కరాలను జూన్ 1వరకు నిర్వహించనున్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందా, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్‌రెడ్డి రంగారెడ్డిలతో పాటు పలువురు త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కర వేడుక ప్రారంబోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గణపతికి తొలి పూజలు చేశారు. సరస్వతి నది అంత్య పుష్కర మహోత్సవానికి అంకురార్పరణ చేశారు.
కంచి పీఠాధిపతి చేతులమీదుగా..
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం రాత్రి త్రివేణి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఉదయం సరస్వతీనది అంత్య పుష్కర స్నానం చేసి.. పుష్కర స్నానాలు ప్రారంభించారు. ఆ తర్వాత భక్తులు స్నానాలు చేశారు. ఈ సందర్భంగా సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామిని, శ్రీ శుభానందదేవిని, సరస్వతి మాతను దర్శించుకున్నారు.
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం సాయంత్రం హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి చేరుకున్నారు. సరస్వతీఘాట్‌లోని త్రివేణి సంగమంలో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం చేశారు. ప్రత్యేక పూజలు చేసి నదీమాతకు పూలు, పండ్లు, పసుపు, కుంకుమతోపాటు చీరసారెను వదిలారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు.
కనుల పండువలా నదీహారతి, తెప్పోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: త్రివేణి సంగమ క్షేత్రం గురువారం రాత్రి విద్యుద్దీపాలతో కళకళలాడింది. త్రివేణి సంగమంలో నదీహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అంత్య పుష్కరాలకు అధికారుల అంచనా మేరకు భక్తులు రాలేదు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. వీఐపీ ఘాట్, ప్రధాన జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు చిన్నపాటిగాలికే కూలిపోయాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎండ తీవ్రతతో వాహనాలు లేక పార్కింగ్ స్థలాలు, రోడ్లు వెలవెలబోయాయి.


