నిధులు లేక.. సమస్యలు తీరక.. | Sanitation is chaotic, Mosquitoes increasing in Telangana village panchayats | Sakshi
Sakshi News home page

నిధులు లేక.. సమస్యలు తీరక..

Jul 9 2026 5:25 AM | Updated on Jul 9 2026 5:25 AM

Sanitation is chaotic, Mosquitoes increasing in Telangana village panchayats

గ్రామ పంచాయతీల్లో పట్టాలెక్కని పరిపాలన

కేంద్ర నిధుల విడుదల మందగమనం.. విడుదల కాని రాష్ట్రం మ్యాచింగ్‌ గ్రాంట్లు 

నిధుల కొరతతో గ్రామాల్లో అత్యవసర పనులూ పడక కష్టసాధ్యంగా తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ  

అస్తవ్యస్తంగా పారిశుధ్యం.. విజృంభిస్తున్న దోమలు 

కొన్ని పంచాయతీలకు నిధులున్నా నిబంధనల కళ్లెం 

పారిశుధ్య కార్మీకులు, సిబ్బంది వేతనాలకే వ్యయం.. అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి 

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు 

విడుదల చేయాలంటున్న సర్పంచ్‌లు 

గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ ఫోకస్‌ 

ముస్తాబాద్‌లో మురుగు ఫుల్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మేజర్‌ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.63 లక్షలు నిల్వ ఉన్నాయి. కానీ మురుగునీటి కాలువ నిర్మించేందుకు అనుమతులు లభించడం లేదు. జిల్లా పంచాయతీ అధికారులు నిధులను కేవలం సిబ్బంది వేతనాలకు మాత్రమే వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చారని సర్పంచ్‌ మట్టా వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనతో గ్రామంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు ఏర్పడి ఆరు నెలలు దాటినా పంచాయతీలను సమస్యలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల మందగించడం, రాష్ట్రం నుంచి అందాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడం, గత పాలకవర్గాల కాలానికి సంబంధించి సుమారు రూ.500 కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు పేరుకు పోవడంతో..పల్లెల్లో పాలన కష్టంగా మారుతోంది. నిధుల కొరతతో అత్యవసరమైన పనులూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజారోగ్యానికి కీలకమైన పారిశుధ్యం, ఇతరత్రా రోజువారీ పనులు కుంటుపడుతున్నాయి. ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్య కార్మీకుల వేతనాలు తదితరాలకు అవసరమైన కేంద్ర–రాష్ట్ర నిధులు సైతం సకాలంలో విడుదల కావడం లేదు. వివిధ జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ‘సాక్షి’బృందం పరిశీలించినప్పుడు అనేక సమస్యలు దృష్టికి వచ్చాయి. 

అర్జంట్‌ పనులూ అంతే.. 
కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు దశల వారీగా విడుదల అవుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక నిధి కింద మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రకటించారు. ఇకపై పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో కాకుండా, నేరుగా పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా పంచాయతీ రాజ్‌ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇవేమీ అమల్లోకి రాకపోవడంతో పంచాయతీల్లో రోజువారీ నిర్వహణ మృగ్యంగా మారుతోంది.  

బిల్లులు చెల్లించలేని దుస్థితి 
గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్పంచులు, సొంత జేబుల నుంచి ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. చాలాచోట్ల చెత్త సేకరణ వాహనాలకు డీజిల్, వీధి దీపాలకు సంబంధించిన కరెంటు బిల్లులు కట్టలేని దుస్థితి ఉంది. మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం, పాత కాల్వలు పూడిక తీయకపోవడంతో మురుగు నిలిచిపోతోంది. తడి, పొడి చెత్తను వేరుచేయడం ఆగిపోయింది.  దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నా యి. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా మోటార్లకు మరమ్మతులు లేకపోవడంతో మూలనపడ్డాయి. చాలా చోట్ల ‘వైకుంఠ ధామాలు’నిర్మాణాలు పూర్తయినా, కొన్నిచోట్ల సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణకు సరైన నిధులు లేకపోవడంతో కొన్నిచోట్ల మొక్కలు ఎండిపోతు న్నాయి. గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో చాలాచోట్ల కలుపు మొక్కలు పెరిగిపోయాయి. క్రీడా పరికరాలు తుప్పు పట్టి కన్పిస్తున్నాయి.  

జీతాలు, పథకాలకు నిధుల మళ్లింపు! 
కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు ’టైడ్‌’ (నిర్దిష్ట పనులకు) ’అన్‌టైడ్‌’ (స్థానిక అవసరాలకు) నిధులను కేటాయిస్తోంది. అయితే గతంలో, ఇటీవలి కాలంలోనూ ఈ నిధులను విద్యుత్‌ బకాయిలు, ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ప్రతిపక్షాలు, సర్పంచ్‌ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

డంపింగ్‌ యార్డుకు చేరని చెత్త 
లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డంపింగ్‌ యార్డులు కొన్నిచోట్ల నిరుపయోగంగా ఉంటున్నాయి. వరంగల్‌ జిల్లా సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో పంట చేల మధ్యలో చెత్త డంపింగ్‌ యార్డు నిర్మించారు. కానీ డంపింగ్‌ యార్డుకు వెళ్లడానికి సరైన దారి ఏర్పాటు చేయలేదు. దీంతో గ్రామంలోని చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించలేకపోతున్నారు.
  
నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు 
ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో గత ప్రభుత్వ హయాంలో యువత కోసం 37 గ్రామాలకు గాను 35 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. మండలంలోని లోతుకుంటలో క్రీడా ప్రాంగణం బోర్డుకే పరిమితం అయ్యింది.

నిలిచిన నిధులు... పెండింగ్‌లో గ్రాంట్లు
15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన సుమారు రూ. 1,090 కోట్ల బకాయిలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన వాటా (మ్యాచింగ్‌ గ్రాంట్లు) దాదాపు రూ. 2,979 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 మే లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం కింద రాబోయే ఐదేళ్ల కాలానికి (2026–31) గ్రామీణ స్థానిక సంస్థల కోసం రూ.9,968 కోట్లను కేటాయించింది. 2026–27 నుంచి వచ్చే ఈ నిధులలో 80% నేరుగా గ్రామ పంచాయతీలకు, 10% మండల పరిషత్తులకు, 10% జిల్లా పరిషత్తులకు దక్కనున్నాయి. ఈ నిధులు ఏటా జూన్, అక్టోబర్‌ నెలల్లో రెండు విడతలుగా విడుదల కావాల్సి ఉంది. 

అయితే కేంద్రం విధించిన కఠినమైన నిబంధనలతో నిధులు డ్రా చేసుకోవడం సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో. ఈ సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదు. రెండేళ్లుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకపోవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు రూ.233.40 కోట్లు నిలిచిపోయాయి. కాగా 16వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యానికి మాత్రమే వాడాలనే నిబంధన విధించారు. ఉద్యోగుల వేతనాలకు లేదా పెన్షన్లకు ఉపయోగించకూడదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement