ముందే మేనేజ్‌ చేశారు..!

Sale Of Management Quota Seats in Engineering Courses Before EAMCET - Sakshi

ఎంసెట్‌కు ముందే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల అమ్మకం

బోధనా సిబ్బందిని రంగంలోకి దింపి భర్తీ చేస్తున్న యాజమాన్యాలు

డొనేషన్ల పేరిటా విద్యార్థుల నుంచి భారీగా దండుకున్న వైనం

ఒక్కో సీటుకు రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు

ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తే చెల్లించిన మొత్తాన్ని తిరిగిస్తామని హామీ

టాప్‌ కాలేజీల్లో ఇప్పటికే సీట్లన్నీ భర్తీ... సీఎస్‌ఈకి తొలి ప్రాధాన్యత  

ఇంటర్‌లో 94% మార్కులు తెచ్చుకున్న దుష్యంత్‌ ఎంసెట్‌కు సిద్ధమవుతున్నప్పటికీ మంచి కాలేజీలో సీటు కోసం మేనేజ్‌మెంట్‌ కోటాలో అడ్మిషన్‌ తీసుకొనేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. హైదరాబాద్‌ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న ఓ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ)లో చేరేందుకు యాజమాన్యాన్ని సంప్రదించాడు. అయితే ఇప్పటికే మెజారిటీ సీట్లు అయిపోయాయని, ట్యూషన్‌ ఫీజుతోపాటు అదనంగా డొనేషన్‌ రూ. 12 లక్షలు చెల్లిస్తే సీటు కేటాయిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి 25% డొనేషన్‌ను అడ్వాన్స్‌గా చెల్లించి సీటు సొంతం చేసుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు బరితెగించాయి. ఇంకా ఎంసెట్‌ జరగ కున్నా యాజమాన్య కోటా సీట్లను అప్ప నంగా విక్రయించేస్తున్నాయి. ఏ కాలేజీలో కటాఫ్‌ ఎలా ఉంటుందో తెలియకున్నా భారీ మొత్తంలో డొనేషన్లు దండుకునేందుకు యాజమాన్య కోటా సీట్లను వేలం వేస్తు న్నాయి. కరోనా నేపథ్యంలో కళాశాలలన్నీ మూతపడినప్పటికీ అంతర్గతంగా బోధన, బోధనేతర సిబ్బందితో మేనేజ్‌మెంట్‌ సీట్లను భర్తీ చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు కొన్ని బ్రాంచుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లన్నింటినీ నింపేశాయి. మరో పది రోజుల్లో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా... ఆలోపే సీట్లన్నీ భర్తీ చేసేలా ప్రణాళిక రచిస్తున్నాయి.

‘కరోనా’ను క్యాష్‌ చేసుకుంటూ...
రాష్ట్రంలో 183 ఇంజనీరింగ్‌ కాలేజీలుండగా ఈ ఏడాది వాటిలో కొన్నింటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతో ఆ కాలేజీలు మినహాయిస్తే మిగిలిన వాటిలో 70% సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తుండగా మిగతా 30% సీట్లు ఆయా యాజమాన్యాలు నింపుకుంటున్నాయి. వాస్తవానికి ఈపాటికే ఎంసెట్‌ ముగిసి అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ సైతం కొలిక్కి వచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో ఎంసెట్‌ ఇంకా జరగలేదు. దీంతో 2020–21 విద్యా సంవత్సరంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొంది. ఈ పరిస్థితిని అదనుగా చేసుకున్న కాలేజీ యాజమాన్యలు... మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. సీటు కన్ఫర్మ్‌ చేసుకుంటే పాఠ్యాంశ బోధన ప్రారంభమవుతుందని, ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా, రాకున్నా ఇబ్బందులుండవనే కోణంలో ప్రచారం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆకర్షితులవుతున్నారు.

దండిగా డొనేషన్లు...
ఇంజనీరింగ్‌లో ప్రస్తుతం సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ కోర్సులకు డిమాండ్‌ ఉంది. సీఎస్‌ఈ కోటాలో ఉన్న మేనేజ్‌మెంట్‌ సీట్లు టాప్‌ కాలేజీల్లో దాదాపుగా భర్తీ అయ్యాయి. డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఈ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం వచ్చే విద్యార్థులపై యాజమాన్యలు డొనేషన్ల పేరిట భారీగా దండుకుంటున్నాయి. సగటున రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. టాప్‌ కాలేజీలుగా పేరున్న వాటిలో రూ. 10 లక్షలకు తక్కువగా డొనేషన్‌ లేదు. డొనేషన్‌తోపాటు రెగ్యులర్‌ ట్యూషన్‌ ఫీజును ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెల్లించాలి. ఈసారి కొత్తగా సీఎస్‌ఈలో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్‌ (డీఎస్‌), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) కేటగిరీలకు డిమాండ్‌ అధికంగా ఉంది. ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ కోర్సులవైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిమాండ్‌కు తగినట్లు యాజమాన్యలు డొనేషన్లను వసూలు చేస్తున్నాయి. ఈసీఈ, ట్రిపుల్‌ ఈ, మెకానికల్, సివిల్‌ బ్రాంచీలలో అడ్మిషన్‌కు రూ. 3 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులోనూ డిమాండ్‌కు తగినట్లు యాజమాన్యాలు రేట్లు ఫిక్స్‌ చేస్తున్నాయి. ఎంసెట్‌లో ర్యాంకు వస్తే డబ్బు వాపస్‌ ఇస్తామని కూడా యాజమాన్యాలు చెబుతుండటంతో అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద కొంత మేర చెల్లించి సీట్లు రిజర్వ్‌ చేసుకుంటున్న వాళ్లు కూడా అధికంగా ఉన్నారు.

ఆ కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజులే...
టాప్‌ కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు భారీగా డొనేషన్లు డిమాండ్‌ చేస్తుండగా ఆ తర్వాతి వరుసలో ఉన్న కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాంటి డొనేషన్లు వద్దంటూ ప్రచారం చేస్తున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందిని రంగంలోకి దింపి కేవలం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తే చాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఈ కాలేజీల్లోనూ సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీలలో సీట్ల భర్తీ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో సీటు వస్తే బుకింగ్‌కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెబుతుండటంతో విద్యార్థులు ముందస్తుగా బుకింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. 

ఎల్బీ నగర్‌కు చెందిన మనుశ్రీని టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్పించాలని నిర్ణయించిన తండ్రి... ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ ప్రఖ్యాత కాలేజీలో అడ్మిషన్‌ కోసం ప్రయత్నించాడు. సీఎస్‌ఈలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా డేటా సైన్స్‌ బ్రాంచ్‌లో సీటు కోరగా రూ. 15 లక్షల డొనేషన్‌తోపాటు ట్యూషన్‌ ఫీజు భరించాల్సి వస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంసెట్‌ మాక్‌ టెస్ట్‌లో మనుశ్రీ స్కొర్‌ను అంచనా వేసుకున్నాక ఆ కాలేజీలో మేనేజ్‌మెంట్‌ కోటా సీటును కన్ఫర్మ్‌ చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా కొన్ని రూ. లక్షలు చెల్లించి ఎంసెట్‌ ర్యాంకు, సీటును బట్టి మిగతా మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top