పేదల కల చెదిరింది! | Sakshi Special Story on Bhudana Land: 75182 Acres of Bhudana Land Yet to Be Distributed | Sakshi
Sakshi News home page

పేదల కల చెదిరింది!

Apr 18 2026 5:55 AM | Updated on Apr 18 2026 5:55 AM

Sakshi Special Story on Bhudana Land: 75182 Acres of Bhudana Land Yet to Be Distributed

1951,ఏప్రిల్‌ 18న పోచంపల్లి గ్రామానికి చేరిన పాదయాత్రలో వినోభా బావే, కేతిరెడ్డి కోదండరెడ్డి, సంగం లక్ష్మీబాయి తదితరులు..

స్ఫూర్తిని పంచినా..కడుపు నింపని భూదానం.. పేదల కోసం ఇచ్చిన భూములు పెద్దల గుప్పిట్లో.. 

ఇంకా పంచని భూదాన భూములు 75,182 ఎకరాలు.. మసకబారిన స్ఫూర్తితో నేడు భూదాన వజ్రోత్సవం

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమి మనిషికి జీవితాన్నిస్తుంది..స్వతంత్రుడిగా నిలబెడుతుంది. అందుకే తెలంగాణ ఆత్మ అంతా భూమి చుట్టే తిరుగుతుంది. భూమి కోసమే ఇక్కడ 4 వేల మంది రైతు కూలీలు తొలుత నిజాం, ఆపై భారత సైన్యంతో (1946–51) జరిగిన పోరులో అమరులైతే.. ఇదే నేలపై ఒక్క రక్తం చుక్క చిందకుండా అదే రైతు కూలీలకు భూమి దానంగా ఇచ్చిన సందర్భానికి ఇప్పుడు సరిగ్గా డెబ్బై ఐదేళ్లు. అంటే 1951 ఏప్రిల్‌ 18న శివరాంపల్లి నుంచి పాదయాత్రగా గాజులపోచంపల్లికి చేరుకున్న వినోబా భావే దళితవాడకు వెళ్లిన సందర్భంలో ‘ఈ ప్రాంత రైతుకూలీలు తుపాకులు ఎందుకు పట్టారని ప్రశి్నస్తే..‘భూమి కోసమే’అంటూ వారు సూటిగా సమాధానం చెప్పారు. ‘మాకు భూమి తప్ప మరో బతుకు లేదు..మా 40 కుటుంబాలకు 80 ఎకరాల భూమిని ఇస్తే మేము స్వతంత్రంగా బతుకుతం..’అంటూ తేల్చిచెప్పారు.

ఈ అంశం అదే రోజు భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి చెవిన పడటంతో సాయంత్రం ఊరి మధ్యలో జరిగిన గ్రామసభలో వినోబాను కలిసి తన తండ్రి కోరిక మేరకు 100 ఎకరాల భూదానాన్ని ప్రకటిస్తూ, ఇంగ్లీష్ లో తన చేతిరాతతో రాసిన సంబంధిత పత్రాలను వినోబాకు అందజేశారు. ఈ భూములను అర్హులైన పేదలకు పంచాలని, తాను చేసే భూదానం వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించా. భూదాన యజ్ఞానికి ఇలా పడిన తొలి అడుగు లక్షల మంది రైతు కూలీల్లో భూమిపై ఆశలు నింపింది. పలుచోట్ల వారిని భూయజమానులను చేసింది.

గాజుల పోచంపల్లిని భూదాన్‌ పోచంపల్లిగా మార్చింది. కానీ 75 ఏళ్ల క్రితం నాటి పరిస్థితిని తాజాగా విశ్లేషిస్తే..పోచంపల్లిలో భూదాన్‌ రామచంద్రారెడ్డి ద్వారా భూములు పొందిన 40 దళిత కుటుంబాల చేతుల్లోనే మెజారిటీ భూములు ఉన్నా.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల భూదాన భూములు ఇప్పుడు పెద్దల స్వాధీనంలోకి వెళ్లాయి. తెలంగాణలో ఇంకా పంచకుండా ఉన్న వేల ఎకరాల భూదాన భూములపై విషనాగుల పడగనీడలు కమ్ముకున్నాయి. 

భూదాన భూముల పక్కదారి 
భూదాన్‌ పోచంపల్లి నింపిన స్ఫూర్తితో ఒక్క రక్తపు చుక్క చిందకుండా..తెలంగాణలోని పేదల కోసం వచ్చిన 1,66,529 ఎకరాల భూదాన భూములిప్పుడు ఏం అయ్యాయి.? పంచినవి నిజంగా పేదల చేతుల్లోనే ఉన్నాయా?, పంచని భూములు ఎన్ని? అవి ఎక్కడ? అని ప్రశ్నిస్తే రద్దు అయిన భూదాన్‌ బోర్డు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా లేవు. పలు రకాల ఫిర్యాదుల నేపథ్యంలో గత ప్రభుత్వం భూదాన బోర్డును రద్దు చేసే నాటికి ఇంకా 75,182 ఎకరాల భూమి వివిధ కారణాలతో పంపిణీ చేయలేదు. అందులో 10 వేల ఎకరాల భూములు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో ఉండగా, పలు ప్రాంతాల్లోని భూములు మళ్లీ పెద్దల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి.  

ప్రజా ప్రతినిధులు, పెద్దల అధీనంలో.. 
ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి సర్వే నంబర్‌ 186, 188, 189 సర్వే నంబర్లలో 30 ఎకరాల భూదాన భూమిని ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంఎల్‌ఏ ఒకరు తమ అ«దీనంలో ఉంచుకోగా, కూకట్‌పల్లిలో సర్వే నంబర్‌ 353, 354లలో 17 ఎకరాల భూమి కూడా రాజకీయ నాయకుల చెంతకు చేరింది. దొంతనపల్లి, జన్వాడలోని భూదాన్‌ భూములను ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ కుటుంబం ఏకంగా తమ ప్రాజెక్టులకు బ్యాంకు గ్యారంటీగా ఇచ్చింది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలంలో రంగాపూర్‌ సర్వే నంబర్‌ 1 నుంచి 89 వరకు 650 ఎకరాల భూదాన భూమి ఉండాలి.

కానీ ఈ భూముల్లో అత్యధికం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు విక్రయిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో పేదలకు పంచగా మిగిలిన భూములు ఇంకా 8,327 ఎకరాలు ఉండాలి. కానీ భూదాన్‌ రికార్డుల్లో అతి తక్కువగా చూపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పేదలకు పంచగా 11, 717, వరంగల్‌లో 9,632, నల్లగొండలో 13,593, ఖమ్మం జిల్లాలో 22,039 ఎకరాలు భూదాన్‌ భూములు ఉండాలి. కానీ వీటి లెక్కలు.. భూదాన్‌ బోర్డు, ప్రభుత్వ రికార్డుల్లో అనేక తప్పుల తడకలతో నిండి ఉండటం గమనార్హం.

చట్టం ఉన్నా తూట్లు! 
భూదాన్‌ భూములను భూదాన్, గ్రామదాన్‌ చట్టం 1965లోని సెక్షన్‌ 14–15 మేరకు భూమిలేని నిరుపేదలకు సాగు కోసం కేటాయించాలి. ఈ భూములు అమ్మడం, కొనటం, బదిలీ, లీజు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టటం నిషేధం. ఒక వేళ ఈ భూమిని సాగు చేయకపోతే సెక్షన్‌ 17 మేరకు తిరిగి స్వా«దీనం చేసుకునే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంది. కానీ రెవెన్యూ, భూదాన్‌బోర్డుల ఉదాసీనత కారణంగా వేల ఎకరాల భూములు పెద్దల ఖాతాల్లో చేరిపోయాయి. 

ప్రాంతాల్లో భూమిని నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలన్న నిబంధనతో పలుచోట్ల నిరుపేదలకు స్థలాలు ఇచ్చినా, దాన్ని ఆసరాగా తీసుకుని భారీగా అనర్హుల పేర పట్టాలు ఇవ్వడంతో పాటు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాగా భూదాన్‌ బోర్డు పునరుద్ధరణే భూముల పరిరక్షణకు మార్గం అని భూదాన్‌ బోర్డు మాజీ చైర్మన్‌ గున్నా రాజేందర్‌రెడ్డి చెప్పారు.  

సమగ్ర విచారణకు ఆదేశించాలి 
తెలంగాణలో భూమి కోసం సాయుధ పోరాటం చేసిన ప్రాంతంలోనే.. స్వచ్ఛందంగా భూమిని దానం చేసిన చరిత్ర ఉండటం గర్వకారణం. కానీ ఈ అంశాన్ని సరైన రీతిలో డీల్‌ చేయలేదు. అందుకే తెలంగాణలో భూమి సమస్య ప్రధానమైంది. ప్రభుత్వం భూదాన్‌ భూములపై సమగ్ర విచారణకు ఆదేశించాలి.     – హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌

బోర్డును పునర్వ్యవస్థీకరించాలి 
భూదాన్‌ భూములు ఎప్పటికీ ప్రభుత్వ భూములు కావు.ఈ భూముల పంపిణీ ప్రభుత్వ పర్యవేక్షణలో భూదాన్‌ బోర్డు ద్వారానే చేపట్టాలి. భూదాన బోర్డును సర్వసేవా సంఘ్‌ ప్రతిని«ధులతో ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – వెదిరె అరవిందరెడ్డి (వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుడు)  

Advertisement
 
Advertisement
Advertisement